జీహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. శానిటేషన్ పై చర్చించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. అప్పటి వరకు తాము నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నిరసనపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే ప్రశ్నోత్తరాల్లో అడగాలని సూచించారు. అయినా బీజేపీ కార్పొరేటర్లు వినకపోవడంతో గద్వాల విజయలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ చేస్తే మార్షల్స్ ను ఉపయోగించి బయటకు పంపుతామని బెదరించారు.
అంతకుముందు ఆగస్టు 23వ తేదీ ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.రెండవ దశ ఎస్ఆర్డీపీ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.., జీహెచ్ఎంసి బకాయిలని వెంటనే చెల్లించాలన్నారు. .శానిటేషన్ సిబ్బంది ధర్నాకు కారణం కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. నాడు శానిటేషన్ సిబ్బంది బతుకులు మారుస్తానని హామీ ఇచ్చారని..కానీ ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు. శానిటేషన్ కార్మికుల దుస్తులు ధరించిన బీజేపీ కార్పొరేటర్లు చెత్తను ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు GHMC ప్రధాన కార్యాలయంలో మీడియా నిరసన చేపట్టింది. జర్నలిస్టులను లోపలికి అనుమతించక పోవడంతో పాత్రికేయులు నిరసనకు దిగారు. మీడియాను అనుమతించొద్దని మేయర్ నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని..ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మేయర్ ఆదేశాలతోనే తాము మీడియాను అడ్డుకుంటున్నామని చెప్పారు.