
- వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి మాజీలు కానున్న కార్పొరేటర్లు
- శివారు మున్సిపాలిటీల విలీనంపై రాని స్పష్టత
- రెండు, మూడు కార్పొరేషన్లపై నో క్లారిటీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ కౌన్సిల్ కు మరో 5 నెలలు మాత్రమే గడువు మిగిలి ఉంది. అయితే, ఎన్నికలు మాత్రం పలు కారణాలతో 2027లోనే జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2020 డిసెంబర్ 4న గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ జరగ్గా, 2021 ఫిబ్రవరి 11న మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.
ఈ లెక్కన వచ్చే ఏడాది ఫిబ్రవరి10 వరకు కౌన్సిల్ కు టైం ఉంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లు అందరూ మాజీలు కానున్నారు. అప్పటి నుంచి స్పెషల్ఆఫీసర్పాలన కొనసాగుతుంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేసే ప్రక్రియ మిగిలి ఉన్నందున ఎన్నికలకు టైం పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
రెండు, లేదా మూడు కార్పొరేషన్లు..
గతేడాదిగా గ్రేటర్లో కార్పొరేషన్లు, శివారు మున్సిపాలిటీలను విలీనం చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. అయితే, రెండు, లేదా మూడు కార్పొరేషన్లు చేస్తారని చర్చ నడుస్తుండగా, ప్రభుత్వం నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. శివారు మున్సిపాలిటీల గడువు ముగిసి ఏడు నెలలైంది. అక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్వినిపిస్తుండగా, విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు సీనియర్ ఆఫీసర్లతో సీఎం సమావేశాలు కూడా నిర్వహించారు. అలాగే, గతంలో ప్రసాద్ రావు కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని గ్రేటర్‌ను హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లుగా చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై స్టడీ చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతమున్న బల్దియాలో మెరుగైన సేవల కోసం 50 సర్కిల్స్ ఉండాలని, ఒక సర్కిల్ లో నాలుగు వార్డులు సమానంగా ఉండేలా చూడాలని గతంలో కమిటీ సూచించింది.
ఈ అంశాల ఆధారంగా హైదరాబాద్ లో 100, సికింద్రాబాద్ లో 100 డివిజన్లు చేస్తే ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వం చర్చించినట్టు తెలుస్తోంది. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు కార్పొరేషన్లు చేయడంపైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉన్నందున జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడంలేదు. కనీసం 10 నెలలైనా పట్టే అవకాశం ఉండడంతో.. 2027లోనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయని కొందరు ఆఫీసర్లు చెప్తున్నారు.
పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీల్లో బౌండరీలు ఫిక్స్...
శివారు మున్సిపాలిటీల్లోకి పలు గ్రామపంచాయతీలను ప్రభుత్వం గతేడాది విలీనం చేసింది. ఇటీవల కలిసిన ఈ గ్రామాలకి సంబంధించి వార్డుల బౌండరీలను దాదాపు ఫిక్స్ చేశారు. ఆరునెలల క్రితమే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. కొన్ని మున్సిపాలిటీలు ఈ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాయి. అయితే, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ముందు ముందు ఇబ్బందులు లేకుండా బౌండరీలు ఫైనల్ చేశామని ఆఫీసర్లు అంటున్నారు. ఒకవేళ గ్రేటర్ లో విలీనం చేసినా లేక ఎన్నికలు నిర్వహించిన ఇబ్బందులు లేకుండా చేశామంటున్నారు.