V6 News

2026 మే లేదా జూన్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.?

2026 మే లేదా జూన్ లో గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికలు.?

వార్డుల డీలిమిటేషన్ పై బుధవారం నుంచి  అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ ప్రక్రియ వారం పాటు కొనసాగనున్నది. విలీనం తర్వాత వార్డుల సంఖ్య 300కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వార్డుల పునర్విభజనకి సంబంధించిన ప్రాసెస్​ను జీహెచ్ఎంసీ స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను స్వీకరించడానికి సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులు, హెడ్డాఫీసులో స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

మే లేదా జూన్​లో ఎన్నికలు? 

విలీనానికి సంబంధించిన హడావిడి చూస్తుంటే వెంటనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీ జోష్ లో ఉంది. ఇదే ఊపులో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రస్తుతం విలీనమైన ప్రాంతాల్లో ఇతర పార్టీల క్యాడర్​చాలా వరకు అధికార పార్టీలోకి చేరారు. ఇది కూడా తమకు కలిసొస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వార్డు పునర్విభజన పూర్తికాగానే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు వెళ్లే అవకాశం ఉంది. అంతా అనుకూలకంగా ఉంటే వచ్చే ఏడాది మే లేదా జూన్ లో గ్రేటర్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.