ఫండ్స్ లేక ఆస్తి పన్నుపై జీహెచ్ఎంసీ ఫోకస్​

ఫండ్స్ లేక ఆస్తి పన్నుపై జీహెచ్ఎంసీ ఫోకస్​
  • ఏడు నెలల్లో రూ.1,250 కోట్ల కలెక్షన్​
  • బల్దియా పరిధిలో రికార్డు స్థాయిలో వసూళ్లు
  • సిబ్బందికి నెలవారీ టార్గెట్లు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్ అవుతోంది. ఈ  ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ. 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1,250 కోట్ల కలెక్షన్ వచ్చింది. 7 నెలల్లో ఇంత మొత్తం పన్ను వసూలు కావడం బల్దియా చరిత్రలోనే ఇదే మొదటిసారి.  2022–23 ఆర్థిక ఏడాదికి జీహెచ్ఎంసీ పెట్టుకున్న టార్గెట్​లో ఇప్పటికే  50 శాతం ట్యాక్స్ వసూలైంది. ​ జీహెచ్ఎంసీ వద్ద ఖజానా లేకపోవడంతో ఒక్కో నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది. కొన్ని సార్లు15వ తేదీ దాటినా కూడా ఉద్యోగులను నెల జీతం రాని సందర్భాలున్నాయి.  ప్రస్తుతం ప్రభుత్వం ఆదుకోవడం తప్ప బల్దియాకు ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో కమిషనర్ సహా ఉన్నతాధికారులు అంతా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​పైనే ఫోకస్ పెట్టారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో బల్దియా  కమిషనర్ లోకేశ్ కుమార్ 4 నెలల నుంచి డైలీ టెలీ కాన్ఫరెన్స్​నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్​ను రాబట్టాలని ఆదేశిస్తున్నారు. సిబ్బందికి నెలవారీ టార్గెట్లతో కలెక్ట్ చేయడం, ట్యాక్స్ పేయర్స్​కు డైలీ మెసేజ్​లు పంపడంతో పాటు బకాయిలు ఉన్న వారి ఇంటికి రెగ్యులర్​గా వెళ్లడంతో ట్యాక్స్ ఆదాయం పెరిగింది.  

స్కీమ్​లకు భారీ స్పందన 

ప్రాపర్టీ ట్యాక్స్​కు సంబంధించి జీహెచ్ఎంసీ స్కీమ్​లను అమల్లోకి తీసుకొస్తున్న టైమ్​లో సిటిజన్ల నుంచి భారీగా స్పందన కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమల్లో ఉన్న ఎర్లీబర్డ్​ స్కీమ్​కు ఊహించని విధంగా కలెక్షన్ వచ్చింది.  ఈ ఒక్క స్కీమ్ తోనే రూ.748 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే ఈ ఏడాది జులై 17న మొదలైన ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్ మెంట్​ స్కీమ్)​ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే రూ.85 కోట్లు  కలెక్ట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండారెగ్యులర్ గా కలెక్ట్ అయ్యే ప్రాపర్టీ ట్యాక్స్​తో కలిపితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1,250 కోట్లు కలెక్ట్ ​అయిందంటున్నారు. స్కీమ్ లు పెట్టిన ప్రతిసారి భారీగా ఆదాయం వస్తుందని, ఈ ఏడాది గతంలో ఎప్పుడులేని విధంగా ట్యాక్స్ వసూలైందంటున్నారు.

మూడేళ్లుగా..

ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో జీహెచ్ఎంసీ టార్గెట్ రీచ్ కావడం లేదు. మూడేళ్లుగా వసూలైన ఆస్తి పన్నులను పరిశీలిస్తే.. 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించి  రూ.1,800 కోట్లు టార్గెట్​ పెట్టుకోగా..రూ.1,357 కోట్లు వచ్చింది. 2020–21లో రూ.1,900 కోట్లు టార్గెట్ పెట్టుకోగా.. రూ.1,633 కోట్లు వసూలైంది. కిందటి ఆర్థిక ఏడాదిలో రూ.2 వేల కోట్లు టార్గెట్ పెట్టుకోగా..  రూ.1,495 కోట్లు వచ్చింది. 2022–23 ఆర్థిక ఏడాదికి సైతం  ప్రాపర్టీ ట్యాక్స్ రూ.2 వేల కోట్లు వసూలు చేయాలని అధికారులు టార్గెట్​గా పెట్టుకున్నారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసేందుకు మరో 5 నెలలు మిగిలి ఉండగానే ఇప్పటికే సగానికి పైగా ఆదాయం రావడంతో ఈసారి టార్గెట్ రీచ్ అవుతామనే ధీమాను బల్దియా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీదారులు ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కలెక్షన్ లోపంతోనే ఆదాయం రావడం లేదని భావించిన అధికారులు అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం కలెక్షన్ పెరిగిందంటున్నారు.

ప్రభుత్వం ఆదుకోకపోవడంతో..  

రాష్ట్ర ప్రభుత్వం నుంచి బల్దియాకు ఎలాంటి ఫండ్స్ రావడం లేదు. కనీసం ప్రభుత్వ భవనాలకు సంబంధించిన రూ.5,564 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను సైతం చెల్లించడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బల్దియా చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు అడగలేక అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై పడ్డారు. వేరే పనులను పట్టించుకోకుండా కేవలం ప్రాపర్టీ ట్యాక్స్​ పైనే కమిషనర్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రాపర్టీ ట్యాక్స్​పై ఎప్పటికప్పుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్​లు నిర్వహిస్తున్నారు. భారీ వానలు కురినప్పుడు  వర్షాలపై కూడా కమిషనర్ ఈ తరహాలో ఎప్పుడు సమావేశాలు నిర్వహించ లేదని బల్దియా సిబ్బంది చెబుతున్నారు. ఎలాగైనా టార్గెట్​ రీచ్ కావాలని కింది స్థాయి అధికారులను కమిషనర్ ఆదేశాలిస్తున్నట్లు సమాచారం.