బల్దియా ఆస్తిపన్ను వసూలుకు కొత్తగా ‘ట్యాక్స్​ నెట్’

బల్దియా ఆస్తిపన్ను వసూలుకు కొత్తగా ‘ట్యాక్స్​ నెట్’

సికింద్రాబాద్​, వెలుగు:  ఆస్తి పన్ను అసెస్ మెంట్ ఇబ్బందులు రాకుండా  పారదర్శకంగా వందశాతం అసెస్ మెంట్  వేగంగా పూర్తిచేసేందుకు ‘ట్యాక్స్​నెట్’​ ఆన్ లైన్ ప్రక్రియను బల్దియా అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మానవ ప్రమేయం లేకుండానే తక్షణమే వివరాలు పొందే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన ఆస్తి అసెస్​మెంట్, మ్యుటేషన్ ప్రక్రియ సులభం అవుతుందని అధికారులు వెల్లడించారు. ఒక వ్యక్తి, సంస్థకు సంబంధించిన పాత ఆస్తి రిజిస్ట్రేషన్  ఇంతకు ముందు జారీచేసిన  ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ నంబర్, ఆటోమేటిక్ గా ఎలాంటి మార్పు లేకుండా అదే నంబర్ తో కొత్త ఓనర్​ పేరిట నమోదవుతుంది. కొత్త ఆస్తి రిజిస్ట్రేషన్  చేసుకున్న వెంటనే అసెస్​మెంట్ కాకుంటే  ఆస్తి పన్నుకు, ఖాళీ స్థలానికి  బల్దియా కొత్త ప్రాపర్టీ ట్యాక్సు ఐడెంటిఫికేషన్, వేకెంట్​ల్యాండ్​కు సంబంధించిన నంబరు కేటాయిస్తారు. నంబరును జారీ చేసిన తర్వాత  రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో సూచించిన ఆస్తి విలువ ప్రకారం పన్ను అసెస్​మెంట్, ఖాళీ స్థలం పన్ను అసెస్​మెంట్​ నిర్ధారణ అవుతుంది. ఇండ్లకు జూబ్లీహిల్స్ లో చదరపు ఫీట్ కు రూ.1.25  పైసల చొప్పున, మిగతా ప్రాంతాలకు  రూ.1 చొప్పున  ఆస్తి పన్ను వేయడం జరుగుతుంది. వేకెంట్ ల్యాండ్ అయిన పక్షంలో రిజిస్ట్రేషన్ విలువలో 0.50 శాతం పన్ను వేస్తారు. ఆస్తి పన్ను అసెస్ మెంట్ చేసిన సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్ కు రెండు లింకులతో కూడిన మెసేజ్ వస్తుంది. మొదటి లింక్ ద్వారా అసెస్​మెంట్​వివరాల కాపీ, రెండో లింక్ ద్వారా ఆస్తిపన్ను చెల్లింపు ఉత్తర్వు ప్రకారంగా నిర్ధారించిన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.