
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్‌లో కుక్కలను పట్టుకోవాలని ప్రజలు జీహెచ్ఎంసీకి భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. కేవలం 36 గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు.జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040 21111111 నంబర్‌కు నగర ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక్కో గంటకు 416 చొప్పున ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు ‘మై జీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్, జీహెచ్ఎంసీ ఆన్లైన్ ట్విట్టర్ అకౌంట్‌కు సైతం ఫిర్యాదు లు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు హెల్ప్లైన్సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సర్కిళ్లలో రోజూ అందే ఫిర్యాదుల్లో పదింటిని మాత్రమే సిబ్బంది అటెండ్ చేయగలుగుతున్నారు. ఈ లెక్కన రోజూ 300 కంప్లైంట్లకు మించి అటెండ్ చేయలేకపోతున్నారు. అంటే ఒక్క గంటలో వచ్చే కంప్లైంట్లను సైతం రోజు మొత్తంలో పరిష్కరించలేకపోతున్నారు. కుక్కలకు నగరంలోని 5 ప్రాంతాల్లో స్టెరిలైజేషన్ చేసే షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. వాటిలో రోజుకు 150 కుక్కలకు మాత్రమే ఆపరేషన్ చేయడం సాధ్యమవుతోంది. ఈ లెక్కన నగరంలో స్టెరిలైజేషన్ చేయాల్సిన కుక్కలు 1.60 లక్షలకుపైగా ఉన్నాయి. వాటన్నింటికీ ఆపరేషన్ చేయడానికి ఎంత కాలం పడుతుందనే దానిపైనా అధికారుల్లో క్లారిటీ లేదు.