లైబ్రరీలకు 11  ఏండ్లుగా సెస్​ ఫండ్స్​ ఇవ్వట్లే..

లైబ్రరీలకు 11  ఏండ్లుగా సెస్​ ఫండ్స్​ ఇవ్వట్లే..
  • ఇతర ఖర్చులకు వాడుకుంటున్న బల్దియా
  •     మెయింటెనెన్స్​కు మాత్రమే నిధులిస్తున్న అధికారులు  
  •     స్టాఫ్, సౌకర్యాలు లేక     ఇప్పటికే 8 లైబ్రరీలు క్లోజ్
  •     ఉన్న వాటిలో కుర్చీలు, పుస్తకాలు లేక రీడర్స్​కు ఇబ్బందులు
  •     పోటీ పరీక్షలకు మెటీరియల్​కావాలని డిమాండ్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని 99 లైబ్రరీలను బల్దియా పట్టించుకోవట్లేదు. కేవలం హైదరాబాద్​ జిల్లాలోని 82 లైబ్రరీల మెయింటెనెన్స్​కు మాత్రమే నెలకు రూ.15లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. రంగారెడ్డి, మేడ్చల్ ​జిల్లాల పరిధిలోని వాటికి అవి కూడా ఇవ్వట్లేదు. బల్దియా ఆఫీసర్లు లైబ్రరీల పేరుతో ఏటా సిటీ జనం నుంచి 8 శాతం సెస్ ​వసూలు చేస్తున్నారే తప్ప వాటి అభివృద్ధికి ఖర్చు చేయట్లేదు.11 ఏండ్లుగా లైబ్రరీల కోసం వాడాల్సిన దాదాపు రూ.వెయ్యి కోట్లను ఇతర పనులకు వాడినట్లు తెలుస్తోంది. దీంతో లైబ్రరీల్లో సరైన ఫెసిలిటీస్ ​లేక రీడర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ​జిల్లాలో సరైన బిల్డింగ్స్ ​లేక, స్టాఫ్ ​కొరతతో ఏసీ గార్డ్స్, చంచల్​గూడ, హిమాయత్ నగర్, మురద్ నగర్, వాల్మీకి నగర్​లోని బ్రాంచ్​  లైబ్రరీలు, మరో 3 మొబైల్ ​లైబ్రరీలు కలిపి మొత్తం 8 లైబ్రరీలు క్లోజ్​అయ్యాయి.   ప్రస్తుతం 82 లైబ్రరీలు కొనసాగుతున్నాయి. వాటిల్లోనూ సరిపడా స్టాఫ్, బుక్స్, సౌలతులు లేవు. రంగారెడ్డి, మేడ్చల్ ​జిల్లాల పరిధిలోని లైబ్రరీల పరిస్థితి కూడా ఇంతే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు రిలీజ్ ​చేస్తుండడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్​అయ్యే యువత ఎక్కువగా సిటీలోని లైబ్రరీలకు వస్తున్నారు. కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నారు. 

ఏండ్ల నాటి పుస్తకాలు, బిల్డింగ్స్

హైదరాబాద్ ​జిల్లాలో 90, మేడ్చల్ ​జిల్లాలోని 18 లైబ్రరీలకు గాను 11, రంగారెడ్డి జిల్లాలోని 25కు గాను 6 లైబ్రరీలు బల్దియా పరిధిలో ఉన్నాయి. వీటిలో సరిపడా వసతులు లేక హైదరాబాద్ ​జిల్లాలో 8 లైబ్రరీలను క్లోజ్​ చేశారు. ఉన్న 82లోనూ కొన్ని చోట్ల 2 లైబ్రరీలకు కలిపి ఒక్కరే ఇన్​చార్జి​గా ఉన్నారు. అమీర్ పేట, షాగంజ్, బాగ్​లింగంపల్లి, సర్ఫేఖాస్, సైదాబాద్, పీఎస్​నగర్, గాంధీనగర్, అంబర్ పేట, మల్కాజిగిరిలోని 9 లైబ్రరీలు అద్దె బిల్డింగుల్లోనే కొనసాగుతున్నాయి. మిగతావి  సొంత బిల్డింగుల్లోనే ఉన్నప్పటికీ ఎల్ఐసీ కాలనీ, లంగర్ హౌస్​లోని లైబ్రరీ బిల్డింగ్​లు  ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. మరికొన్ని చోట్ల విరిగిపోయిన కుర్చీలు, టేబుల్స్ కనిపిస్తున్నాయి. సరిపడా బుక్స్, కుర్చీలు అందుబాటులో లేవు. ఇప్పటికీ ఏండ్ల నాటి పుస్తకాలే ఉన్నాయి. కొత్తవి కావాలని రీడర్స్ అడుగుతున్నప్పటికీ అధికారులు  అందుబాటులో ఉంచడం లేదు. కొన్నిచోట్ల కేవలం న్యూస్ పేపర్లకే పరిమితం చేస్తున్నారు. సిటీ సెంట్రల్​ లైబ్రరీతో పాటు గ్రేడ్–1 లైబ్రరీలు మరో 6 ఉన్నాయి. సిటీ సెంట్రల్​ లైబ్రరీ ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతుండగా, గ్రేడ్–1 లైబ్రరీలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు, బ్రాంచ్​ లైబ్రరీలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్ర 3 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగుతున్నాయి. జనం నుంచి వసూలు చేస్తున్న లైబ్రరీ సెస్ ఫండ్స్ ​రిలీజ్​చేయాలని ఎన్నిసార్లు లెటర్లు రాసినా బల్దియా అధికారుల నుంచి స్పందన రావడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు.

ఆ ఒక్కచోటికే 3 వేల మంది

ప్రస్తుతం నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. బ్రాంచ్​ లైబ్రరీల్లో కనీస సౌలతులు  లేకపోవడంతో అశోక్ నగర్​లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి గతంలో ఎన్నడూ లేనంతగా డైలీ 3వేల మంది రీడర్స్​ వస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన బుక్స్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మెటీరియల్ కావాలంటూ డిమాండ్ బుక్​లో రాస్తున్నప్పటికీ అందుబాటులో ఉంచట్లేదు. దీంతో నిరుద్యోగులే బయటి నుంచి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. పేద, మధ్యతరగతి వారు ప్రిపేర్ అయ్యే లైబ్రరీల్లో సౌలతులు లేకపోవడంతో వారికి చాలా ఇబ్బందిగా మారింది. 

ఉన్నవాటికి ఫండ్స్​ ఇస్తే చాలు

ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్​ఎమ్మెల్యేలను ఆదేశించారు. కానీ ఉన్న లైబ్రరీలను పట్టించుకోమని చెప్పడం లేదు. కనీసం జీహెచ్ఎంసీ నుంచి లైబ్రరీలకు రావాల్సి ఫండ్స్ ​రిలీజ్ చేయిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి కోచింగ్ సెంటర్లు పెట్టమని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా లైబ్రరీలకు  జీహెచ్ఎంసీ పడ్డ బకాయిలను అందిస్తే  లైబ్రరీల్లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల తరహాలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీనిపై మంత్రి కేటీఆర్ ఫోకస్ ​పెట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

అన్ని మెటీరియల్స్ ఉంచాలి

నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నా. కరీంనగర్ నుంచి వచ్చి హిమాయత్​నగర్​లో ఉంటూ అశోక్ నగర్​లో కోచింగ్ తీసుకుంటున్నా. క్లాసులు అయిపోయాక సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి చదువుతున్నా. కానీ నాకు అవసరమయ్యే మెటిరీయల్స్ లైబ్రరీలో అందుబాటులో లేవు. అన్నిరకాల బుక్స్​పెడితే నాలాంటి వారికి ఎంతో ఉపయోగపడతాయి.
- అనూష, కరీంనగర్

  ఫండ్స్​ ఇస్తే బాగుండు

మాది సూర్యాపేట. గ్రూప్-–2 ఎగ్జామ్స్ కోసం 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఇప్పటికే ఒకసారి కోచింగ్ తీసుకున్నా. మళ్లీ కోచింగ్ ఎందుకని చిక్కడపల్లిలో ఉంటూ సిటీ సెంట్రల్ ​లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నా. ప్రభుత్వం నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ లైబ్రరీలకు ఫండ్స్​ ఇస్తే బాగుంటుంది. 
– రమేశ్, సూర్యాపేట

మరిన్ని బుక్స్​ తెప్పిస్తం

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మెటీరియల్ కొనుగోలు చేశాం. మరికొన్ని బుక్స్​తెప్పించి అందుబాటులో ఉంచుతాం. వచ్చేనెల1 నుంచి అన్ని లైబ్రరీల్లో కొత్త పుస్తకాలను అందుబాటులో ఉంచుతాం. 
- పద్మజ, సిటీ లైబ్రరీ సెక్రెటరీ