
- అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌ను బహిరంగ మూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ విదేశాల విధానాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. మూడేళ్ల క్రితం నగరంలో స్వచ్ఛ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చినా పెద్దగా మార్పు కనిపింలేదు. వీటి నిర్వహణ వ్యయాన్ని జీహెచ్ఎంసీనే భరించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఇప్పుడు బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(బీవోటీ) కింద పే అండ్ యూజ్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది.
వీటి ఏర్పాటు, ఆపరేటింగ్ కు ఆసక్తి గల సంస్థల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) బిడ్లను జీహెచ్ఎంసీ మంగళవారం ఆహ్వానించింది. ఈ బిడ్లను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడకుండా బీవోటీ ప్రాతిపదికన ఈ టాయిలెట్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురానుంది. తొలి దశగా సికింద్రాబాద్ జోన్ లో అందుబాటులోకి తీసుకుకొచ్చి, ఆ తరువాత మిగతా జోన్లలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు జూబ్లీ బస్ స్టేషన్ కు ప్రతి రోజు ప్రజలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ప్రయోగాత్మకంగా ఈ జోన్ లో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలను రిజర్వేషన్ల ప్రకారం అప్పగించాలని బల్దియా నిర్ణయించింది. సఫాయి కర్మచారిలకు 25 శాతం, దివ్యాంగులకు పది శాతం కేటాయించి, మిగిలిన 65 శాతం జనరల్ కోటా కింద వివిధ సంస్థలకు కేటాయించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.