
హైదరాబాద్, వెలుగు: బిల్డర్ నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాత పవన్‌కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. లంచం డబ్బుతో పట్టుబడిన పవన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం..రామంతాపూర్‌కు చెందిన గోపగాని రమణమూర్తి బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ చేస్తుంటాడు.
ఉప్పల్ భగాయత్ శాంతి నగర్‌లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సికింద్రాబాద్ బుద్ధ భవన్‌లోని ఇరిగేషన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కోసం ఎన్‌వోసీ ఇవ్వాలని కోరాడు. దీనికి ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాత పవన్‌కుమార్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ట్రాప్ స్కెచ్ వేశారు. బుద్ధభవన్‌లోని తన ఆఫీస్‌లో రూ.4లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.