V6 News

GHMC మెయింటనెన్స్ వెరీ బ్యాడ్.. ఏండ్లుగా వాటర్ పైపులైన్, మీటర్ను పట్టించుకోవట్లే

GHMC మెయింటనెన్స్ వెరీ బ్యాడ్..  ఏండ్లుగా వాటర్ పైపులైన్, మీటర్ను పట్టించుకోవట్లే
  • జలమండలి తనిఖీలో తుప్పుపట్టి కనిపించిన మీటర్​
  • అందుకే రెండు రోజులుగా వాటర్​ సమస్య
  • శుక్రవారం కూడా  ప్రైవేట్ ట్యాంకర్లే బుకింగ్
  • జీహెచ్​ఎంసీ తీరుపై విమర్శలు

హైదరాబాద్​సిటీ, వెలుగు:
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 20 ఏండ్ల కిందట వేసిన వాటర్​బోర్డ్​పైపులైన్, మీటర్​తుప్పు పట్టడంతో నీళ్లు రాక అధికారులు, సిబ్బంది మూడు రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టాయిలెట్​లో కూడా నీళ్లు రాక మినరల్​వాటర్​బాటిల్స్​వాడాల్సిన దుస్థితి దాపురించింది. 

దీంతో ప్రైవేట్​వాటర్​ట్యాంకర్లు బుక్​చేసి సమస్యను అధిగమించే ప్రయత్నం చేశారు. అయినా, నీళ్లు సరిపోలేదు. అయితే, వాటర్​బోర్డు ట్యాంకర్లు ఉండగా, ప్రైవేట్​ట్యాంకర్లు బుక్​చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయింటనెన్స్​విభాగం పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.  

 తుప్పుపట్టిన వాటర్​ పైపులైన్​, మీటర్​

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు 1983 నుంచి కొనసాగుతోంది. అప్పుడే వాటర్​బోర్డు పైపులైన్​వేసింది. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో సమస్యకు కారణం ఏమిటో తేల్చేందుకు వాటర్​బోర్డు టెక్నికల్​టీమ్​ను రంగంలోకి దింపింది. వారు రెండు  రోజులుగా జీహెచ్ఎంసీ బిల్డింగ్ లోని పైపులైన్​ను అణువణువు తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో పైపులైన్ తో పాటు మీటర్ కూడా తుప్పు పట్టి కనిపించింది. దీంతో ప్రెజర్ తగ్గి నీళ్లు రావడం లేదని తేల్చింది. దీంతో పాటు పక్కనున్న ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) బిల్డింగ్ లో నూ లీకేజీ సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణాలతో రెండు ఇంచ్ లు సరఫరా కావాల్సిన పైపులో కేవలం హాఫ్​ఇంచ్​మాత్రమే సరఫరా అవుతుందని తెలుసుకున్నారు. 

దీంతో శుక్రవారం సాయంత్రానికి మీటర్ మార్చడంతో పాటు పైపులైన్ పనులు పూర్తి చేశారు.  పనులు చేసినా కాంక్రీట్ వేయడంతో మునుపటిలా నీటి సరఫరాకు మరింత టైం పట్టే అవకాశం ఉందంటున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో సోమవారం నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగే ఛాన్స్​ఉంది.  కాగా, మీటర్ తో పాటు పైపులైన్ కూడా తుప్పు పట్టిపోయి పనికిరాకుండా పోతే మెయింటనెన్స్​విభాగం ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


మళ్లీ ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కు 

నీటి సరఫరా లేకపోవడంతో గురువారం ప్రైవేట్ ట్యాంకర్లను బుక్​చేసిన బల్దియా శుక్రవారం కూడా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడింది. గురువారం రాత్రి ఏడు ప్రైవేట్​ట్యాంకర్లు తెప్పించగా, శుక్రవారం మరో ఏడు ప్రైవేట్​ట్యాంకర్లను రప్పించారు.  జలమండలి నీటి ట్యాంకర్లను పంపిస్తామని వాటర్​బోర్డు జీఎం చెప్పినా ఆలస్యం చేశారని, అందుకే ప్రైవేట్​ట్యాంకర్లు తీసుకురావాల్సి వచ్చిందని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. ఈ విషయమై ‘వెలుగు’ వాటర్ బోర్డు జీఎంను ప్రశ్నించగా జీహెచ్ఎంసీ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఏఈతో మాట్లాడి జలమండలి ట్యాంకర్ పంపించారు. ప్రైవేట్ ట్యాంకర్లతో జీహెచ్ఎంసీకి ఒక్కో ట్యాంకర్ పై రూ.650 అదనంగా ఖర్చవుతున్నది. జలమండలి ట్యాంకర్ రూ.550 కి వస్తుండగా, ప్రైవేట్ ట్యాంకర్ రూ.1200 ఉంది.  

తుప్పు పట్టిన పైపులైన్ వల్లే..

బిల్డింగ్ ప్రాంగణంలో ఉన్న 50ఎంఎం డయా జీఐ నీటి సరఫరా పైపులైన్​పూర్తిగా తుప్పు పట్టింది.. అనేక చోట్ల లీకేజీలు ఉన్నాయి. మేం రెగ్యులర్​గా పంపే నీటినే సరఫరా చేస్తున్నా పైపులైన్​సమస్య కారణంగా సంప్‌‌‌‌ లోకి  నీరు చేరడం లేదు. బల్దియా బిల్డింగ్​ఇంటర్నల్​నెట్‌‌‌‌వర్క్ మెయింటనెన్స్​ను జీహెచ్ఎంసీ బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగం చూసుకుంటుంది. శుక్రవారం సాయంత్రం  నుంచి జలమండలి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశాం.   –ప్రభు,  చీఫ్ జనరల్ మేనేజర్, సర్కిల్-2