హైదరాబాద్ లో 5 లక్షల 70 వేల కుక్కలు : మేయర్ విజయలక్ష్మీ

హైదరాబాద్ లో 5 లక్షల 70 వేల కుక్కలు : మేయర్ విజయలక్ష్మీ

కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం చాలా బాధాకరం అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో 5 లక్షల 70 వేల కుక్కలు ఉన్నాయని, ఇందులో 4 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. గ్రేటర్ లో 30 సర్కిల్స్ లో కుక్కలను పట్టుకోవడం కోసం 30 టీమ్ లు పని చేస్తున్నాయని తెలిపారు. కుక్కలకు స్టేరిలైజేషన్ చేస్తున్నామని, అయితే.. కొన్ని కుక్కులు స్టేరిలైజేషన్ చేసినా కరుస్తాయన్నారు. కుక్కులను పబ్లిక్ అడాప్ట్ చేసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి సర్కిల్లోనూ 20 చొప్పున ప్రతి నెలకు 600 కుక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు. కుక్కలకు సంబంధించిన విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కుక్కులపై చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని గుర్తు చేశారు. 

హైదరాబాద్ లో తాజాగా జరిగిన వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచి వేస్తోంది. బాగ్ అంబర్ పేటలో ఉంటున్న గంగాధర్.. తన కొడుకు ప్రదీప్ ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా.. అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత బాలున్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో చనిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.