సమస్యలకు కేరాఫ్ గా ప్రకృతి వనాలు 

సమస్యలకు కేరాఫ్ గా ప్రకృతి వనాలు 

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులు చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నాయి. పార్కుల మెయింటెనెన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నా.. నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. ఒకవైపు సిబ్బంది నిర్లక్ష్యం.. మరోవైపు అధికారుల అలసత్వంతో పార్కులు సమస్యలకు కేరాఫ్ గా మారాయి. ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు..గబ్బుమయంగా మారుతున్నాయి. విశాలమైన పార్కుల్లో అందమైన మొక్కలుండాల్సిన చోట పిచ్చి చెట్లు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక పెద్ద చెట్లకు నీరు అందక ఎండిపోతున్నాయి. వాకర్స్ ట్రాక్స్ అధ్వాన్నంగా మారుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాలా ఏరియాల్లోని పార్కులకు వాకర్లు రావడమే మానేశారు. 

పచ్చదనం అభివృద్ది చేయడంలో నిర్లక్ష్యం

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో చాలా పార్కులు మెయింటెనెన్స్ లేక అధ్వాన్నంగా తయారయ్యాయి. సొసైటీ ఏర్పాటు చేసే సమయంలో ప్రతి 20 నివాసాలకు ఓ పార్కు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగా జీహెచ్ఎంసీ ప్రహారీ కూడా నిర్మించింది. కానీ అందులో పచ్చదనం అభివృద్ది చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొక్కలు నాటి, అవి పెరిగేంత వరకు సిబ్బందిని నియమించాల్సి ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాన గేటు నుంచి మొదలుపెడితే..పార్కుల లోపల నిర్వహణ వరకు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.  

అసాంఘిక శక్తులకు అడ్డగా

ప్రజాప్రతినిధుల చొరవ కరువై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రకృతి వనాలు సమస్యలకు కేరాఫ్ గా మారాయి. పార్కులను బాగుచేస్తామంటున్న అధికారులు మాటల వరకే పరిమితం అవుతున్నారు. పార్కుల్లో పచ్చదనం దెబ్బతినగా... పరికరాలు మూలన పడుతున్నాయి. కొన్ని పార్కులకు సెక్యూరిటీ లేకపోవడంతో అసాంఘిక శక్తులకు అడ్డగా మారుతున్నాయంటున్నారు స్ధానికులు. అధికారులు, ప్రభుత్వం స్పందించి పార్కులను బాగు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.