గణపతి నిమజ్జనాలకు హుస్సేన్సాగర్లో ఏర్పాట్లు చేయని బల్దియా

గణపతి నిమజ్జనాలకు హుస్సేన్సాగర్లో ఏర్పాట్లు చేయని బల్దియా

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలో నవరాత్రుల్లో భాగంగా లక్షల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల గణనాథుడికి అట్టహాసంగా పూజలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులు అయిపోయి మూడో రోజు వచ్చేసింది. కానీ ఇంతవరకు ఎక్కడ నిమజ్జనం చేయాలనే దానిపై మండపాల నిర్వాహకులకు క్లారిటీ లేదు. వినాయక చవితికి కొన్నిరోజుల ముందే మండపాల ఏర్పాటుకు పోలీసులు పర్మిషన్​ఇచ్చేశారు. ఏటా హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేస్తుండగా ఈసారి అక్కడ పీవోపీ విగ్రహాలను వేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చెబుతోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు నిమజ్జనానికి ఇప్పటికే ఉన్న 28 బేబీ పాండ్స్ తోపాటు అదనంగా 24 పోర్టబుల్, 22 ఎక్సివేషన్​పాండ్స్​పాండ్స్ ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. కానీ ఏ ఏరియా వాళ్లు ఎక్కడి పాండ్​లో చేయాలో మండపాల నిర్వాహకులకు ఎలాంటి సూచనలు చేయలేదు. హుస్సేన్​సాగర్​వద్ద పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆంక్షలు విధించడంతో అధికారులు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. 

ఉన్నవి సరిపోవు.. ఇంకా కావాలి

గణేశ్​నిమజ్జనం కోసం ట్యాంక్​బండ్​పై ఏటా 40కిపైగా క్రేన్ లు ఏర్పాటు చేసేవారు. అన్ని ఉన్నా నిమజ్జనం ఆఖరి రోజు పొద్దున నుంచి తర్వాతి రోజు ఉదయం కొనసాగేది. అధికారుల ఈసారి బేబీ పాండ్స్ లో చేయాలని అంటుండడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక్కో జోన్ లో10 కిపైగా కొలనులు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 14 కొలనులు పెట్టారు. విగ్రహాన్ని పాండ్​లో వేసిన వెంటనే తీసేస్తేనే మరో విగ్రహం వేసే అవకాశం ఉండదు. ఇలా అయితే 5వ, 7వ, 9వ రోజుల్లో చాలా టైం పట్టేలా ఉంది. చార్మినార్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో 23 కొలనులు మాత్రమే ఏర్పాటు చేశారు.ఈ జోన్ల పరిధిలోనే అత్యధిక మండపాలు ఉన్నాయి. ఇక్కడ మరిన్ని కొలనులు కావాల్సి ఉంది. చాలా మంది సాగర్​లో నిమజ్జనం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. 

అక్కడ బడా గణేశ్​మాత్రమే..

ఖైరతబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం మాత్రమే హుస్సేన్​సాగర్​వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈసారి మొత్తం మట్టితో తయారు చేయడంతో బడా గణేశ్​ను ఎప్పటిలాగే ట్యాంక్​బండ్​పై చేస్తున్నారు. ఇందుకోసం భారీ క్రేన్ ని ఏర్పాటు చేస్తున్నారు. మిగతా విగ్రహాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశాలు వస్తాయేమోనని అధికారులు, మండపాల నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. 

కిండర్ స్పోర్ట్స్, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో..

గణేశ్ ​నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ, కిండర్‌ స్పోర్ట్స్ కంపెనీ ఆధ్వర్యంలో గ్రేటర్​వ్యాప్తంగా 24 ఏరియాల్లో పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో మట్టి విగ్రహాలతోపాటు పీఓపీ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేలా రూపొందించారు. నిమజ్జనాలు అయిపోయాక వీటిని ఈత కొలనులుగా ఉపయోగించుకునే వీలుంది. కిండర్ స్పోర్ట్స్ కంపెనీ స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులోని లేని పిల్లల కోసం ఆక్వాటిక్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో పూల్ ఫర్ స్కూల్ అనే కాన్పెప్ట్ ని తీసుకొచ్చినట్లు కిండర్ స్పోర్ట్స్ డైరెక్టర్ నిఖిల్ లడ్డా తెలిపారు. మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఎన్టీఆర్ స్టేడియం, అంబర్‌పేట స్టేడియం, చిలకలగూడ గ్రౌండ్, కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్‌లో పోర్టబుల్​ పూల్స్​ఉన్నాయన్నారు.