
- జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు
- పోలీసుల అదుపులో పాతబస్తీ వీధులు
- ఇవాళ సాయంత్రం చార్మినార్ నుంచి
- 109 దేశాల కంటెస్టెంట్ల క్యాట్ వాక్
- మార్ఫా బ్యాండ్ తో పార్టిసిపేంట్స్ కు స్వాగతం
- రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- పోటీల నేపథ్యంలో పాత బస్తీకి కొత్త సొబగులు
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఇవాళ చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. సాయంత్రం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ ఆ ప్రాంతంలోని యాభై కుక్కలను పట్టేసింది. పట్టుకున్న కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేశారు. హెరిటేజ్ వాక్ కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాతబస్తీ వీధులన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు సుందరీమణులు చార్మినార్ చేరుకోనున్నారు. అలా చేరుకున్న వారికి పాతబస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటో షూట్‌ను కూడా నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఫొటో షూట్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. లాడ్ బజార్ లోని తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక.. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు. నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒక్కో గ్రూప్ రెండు షాప్ లలో షాపింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఓల్డ్ సిటీ.. ఫుల్ బ్యూటీ
చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. సుందరీమణులు హెరిటేజ్ వాక్, షాపింగ్ చేసే లాడ్ బజార్ పరిసరాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లో రహదారులను అందంగా తీర్చిదిద్దారు. ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేయనున్నారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గంటారని సమాచారం.
షాపింగ్ చేసే దుకాణాలివే
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతీలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాలా, కేఆర్ కాసత్, జాజు పెరల్స్ ,ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు.