
- 212 కి.మీ కొత్త ఫుట్పాత్ల నిర్మాణం, రిపేర్లు
- 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో 15 కంప్లీట్చేసినం
- మూడు నెలల్లో1,442 గుంతలు పూడ్చినం
- సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ కమిటీతో బల్దియా కమిషనర్
- పవర్పాయింట్ ప్రజెంటేషన్ఇచ్చిన కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జస్టిస్ సప్రే అధ్యక్షతన బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో బుధవారం (సెప్టెంబర్ 10) నిర్వహించిన సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. సీఎస్ రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులందరూ ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిటీలో చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ కర్ణన్ వివరించారు.
పాదచారులకు భద్రతకు ప్రాధాన్యం
సిటీలో 1,687.76 కి.మీ రోడ్లపై లేన్ మార్కింగ్, 3,949 జీబ్రా క్రాసింగ్స్, 3,453 అడ్డ బార్ గుర్తులు, 3,335 సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు కమిషనర్వివరించారు. ప్రధాన రోడ్లలో ప్రతి సంవత్సరం లేన్ మార్కింగ్ చేస్తున్నామని, పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 212.71 కి.మీ మేర కొత్త ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టడంతో పాటు రిపేర్లు చేశామన్నారు. 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో 15 పూర్తి చేశామని, 50 చౌరస్తాల అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. 92 బ్లాక్ స్పాట్స్‌లో 75 చోట్ల రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
1442 గుంతలు పూడ్చినం
రోడ్డు భద్రతా డ్రైవ్‌లో భాగంగా ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు 1,442 గుంతలు పూడ్చివేసి, 574 క్యాచ్‌పిట్ రిపేర్లు చేశామని, 328 క్యాచ్‌పిట్ కవర్లు మార్చామని, 12 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, టోలిచౌకీ ఫ్లైఓవర్, సనత్‌నగర్, మాదాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్ ప్రాంతాల్లో తారు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీంతో బల్దియా కృషిని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అభినందించినట్లు
కమిషనర్ తెలిపారు.
శేరిలింగంపల్లిలో కర్ణన్ పర్యటన
శేరిలింగంపల్లి జోన్‌లోని యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను బుధవారం జీహెచ్ఎంసీ కమీషనర్ఆర్వీ కర్ణన్పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త తొలగింపు, స్వీపింగ్, వ్యర్థాల నిర్వహణ అంశాలపై శానిటేషన్ అడిషనల్కమిషనర్ రఘు ప్రసాద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావులతో సమీక్షించారు. స్థానికులతో మాట్లాడారు. జోనల్, సర్కిల్ ఆఫీసర్లు పారిశుద్ద్య కార్యక్రమాలపై పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.