రోడ్డేసుకో.. టీడీఆర్ తీసుకో!..ఆర్థిక భారం తగ్గించుకునేందుకుGHMC ప్లాన్

రోడ్డేసుకో.. టీడీఆర్ తీసుకో!..ఆర్థిక భారం తగ్గించుకునేందుకుGHMC ప్లాన్
  • రోడ్డు విలువని బట్టి టీడీఆర్ ఇచ్చేందుకు సిద్ధం 
  •  కాంట్రాక్టర్లు వాటిని అమ్ముకుని డబ్బులు రాబట్టుకునే చాన్స్​ 
  • ఇప్పటికే మహారాష్ట్రలో అమలవుతున్న విధానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్థిక భారం తగ్గించేందుకు జీహెచ్ఎంసీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యింది. రోడ్ల నిర్మాణానికి అవుతున్న ఖర్చును తగ్గించేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులకు బదులుగా టీడీఆర్(ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌) ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

మహారాష్ట్రలో కొనసాగుతున్న ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ అమలు చేయాలని ఆలోచన చేస్తున్నది. ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లకు సంబంధిత ప్రాంతాల్లో రోడ్లు వేయాలని సూచించడంతో పాటు దానికి ఎంత ఖర్చవుతందని అంచనా వేసి.. అందుకు సరిపడా టీడీఆర్ ను అందజేయనున్నది. ఈ విధానం అమలు చేస్తే జీహెచ్ఎంసీ నయాపైసా ఖర్చు పెట్టకుండా రోడ్లు వేయించొచ్చు.  

ఫుల్ డిమాండ్..

గ్రేటర్ లో అనుమతి ఉన్నదాని కంటే మరో అంతస్తు ఎక్కువ వేసుకునేందుకు, సెట్ బ్యాక్ కి సంబంధించి మినహాయింపు పొందేందుకు టీడీఆర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే, నిర్మాణాలు జరపకముందే ఎవరి దగ్గరైనా టీడీఆర్​ఉంటే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటివరకు చాలామంది టీడీఆర్ అవసరమున్న వారు టీడీఆర్ ఉన్న వారిని సంపద్రించి వారితో రేటు మాట్లాడి కొనుక్కుంటున్నారు. దీనివల్ల టీడీఆర్​ఉన్నవారికి ఎక్కువ ధర వస్తుండడంతో లాభమే జరుగుతోంది. కొన్ని నెలలుగా టీడీఆర్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుండడంతో టీడీఆర్ ఉన్న వారు రేటు పెరుగుతుందని అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ ధర కంటే 50 శాతం ఎక్కువకు టీడీఆర్ కొంటున్నారు. రోజురోజుకూ రియల్ ఎస్టేట్ తరహాలోనే టీడీఆర్ కు రేట్లు పెరుగుతున్నాయి.  

ఇక తీరనున్న రోడ్ల సమస్య..

టీడీఆర్ కు రోజురోజుకు డిమాండ్ పెరగడంతో జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి టీడీఆర్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్ కు బాధ్యతలను అప్పగించే విషయంలో అంతా ఇప్పుడు జరుగుతున్నట్టే ఉంటుంది. టెండర్లు, మెజర్ మెంట్ అంతా యథావిధిగానే జరగనున్నది. చివరగా బిల్లులకు బదులుగా టీడీఆర్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో టీడీఆర్​కు డిమాండ్​ఉండడంతో కాంట్రాక్టర్ కు లాభం జరగనున్నది. మార్కెట్ వ్యాల్యూతో టీడీఆర్ ఇస్తుండగా సదరు కాంట్రాక్టర్ అంతకు రెట్టింపుగా విక్రయించుకునే అవకాశం ఉంది.

టీడీఆర్ అంటే..

రోడ్లు, నాలాల విస్తరణ తదితర పనుల కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా టీడీఆర్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ అందజేస్తోంది. ఎవరైనా ఒక నిర్వాసితుడు రోడ్ల విస్తరణ వల్ల ఆస్తులను కోల్పోయినప్పుడు అంతకు నాలుగు రెట్లు.. నాలాలు, వాటర్ బాడీస్​లో కోల్పొతే రెండు రెట్ల ఎక్కువకు టీడీఆర్‌‌‌‌‌‌‌‌ పత్రాలను పరిహారంగా అందజేస్తారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ దాదాపు 38 లక్షల చదరపు గజాల టీడీఆర్ సర్టిఫికెట్లను అందజేసింది. ఇందులో దాదాపు 20 లక్షల చదరపు గజాలకు సంబంధించిన టీడీఆర్​లను వినియోగించుకున్నారు. ఇంకా దాదాపు18 లక్షల చదరపుగజాల టీడీఆర్ అందుబాటులో ఉంది.