
- రూ.3,849 కోట్లతో కట్టనున్న వాటర్‌బోర్డు
- కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ స్కీమ్‌లో భాగంగానే..
- ప్రస్తుతం గ్రేటర్లో 31 ఎస్టీపీలు
- నిర్మాణ దశలో మరో 12
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔటర్‌పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా 39 ఎస్టీపీల పనులు ప్రారంభించేందుకు వాటర్‌బోర్డు కసరత్తు చేస్తున్నది. అమృత్పథకంలో భాగంగా ఈ ఎస్టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.3,849 కోట్లను మంజూరు చేసింది. వీటికి ఇటీవలే అడ్మినిస్ట్రేటివ్శాంక్షన్కూడా లభించింది. ఇప్పటికే బోర్డు పరిధిలో 20 ఎస్టీపీలు (772 ఎంఎల్డీ) పని చేస్తుండగా, రెండేండ్ల కింద 23 కొత్త ఎస్టీపీల నిర్మాణం మొదలుపెట్టారు. ఇందులోనూ 11 (1106 ఎంఎల్డీ) అందుబాటులోకి రాగా, మరో12 నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా అమృత్ పథకంలో మరో 39 కొత్త ఎస్టీపీలను నిర్మించనున్న నేపథ్యంలో గ్రేటర్లో మురుగు సమస్య పరిష్కారమైనట్టేనని భావిస్తున్నారు.
రోజూ 1950 ఎంఎల్డీల మురుగు
హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజుకు 1950 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతుండగా, బల్దియా పరిధిలోనే 1650 ఎంఎల్డీలు ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడున్న 31 ఎస్టీపీలతో పాటు కొత్తగా ప్రతిపాదించిన 39 ఎస్టీపీలు కూడా పూర్తయితే గ్రేటర్ లో వందశాతం మురుగును శుద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. కొత్త ఎస్టీపీల ప్రధాన ఉద్దేశం ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే మురుగు మూసీలో కలవకుండా చూడడమేనని చెప్తున్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రారంభానికంటే ముందే 39 ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు. ముందుగా.. భూవివాదాలు లేని చోట ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. భూవివాదాలు ఉంటే కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టేట్అధికారులకు సూచించారు. తక్కువ స్థలంలో ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎస్టీపీలను నిర్మించే అవకాశాలను అధ్యయనం చేసి దానికి సంబంధించిన టెక్నాలజీని అన్వేషించాలని అధికారులను కోరారు.
రెండు ప్యాకేజీలుగా..
ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా నిర్మించాలని ప్రతిపాదించారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలను నిర్మించనున్నారు. అలాగే ఒక ఎస్టీపీ (పటేల్ చెరువు)ని రూ.64.11కోట్లతో పీపీపీ మోడ్‌లో కట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
ఎస్టీపీలను నిర్మించే ప్రాంతాలు ఇవే...
39 ఎస్టీపీలను అమీన్‌పూర్, తెల్లాపూర్, ఇక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి (ఓఆర్ఆర్), సంగం (బాపూఘాట్), హైదర్‌షా కోట్ల, ఫతే నగర్, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీర్‌పేట్, మసాబ్ చెరువు, కాప్రా, రావిర్యాల్, బొంగులూరు తదితర ప్రాంతాల్లో నిర్మించనున్నారు.