
- రూ.500 నుంచి లక్షల్లో జరిమానాలు
- విచ్చలవిడిగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వాడకం
- ఎన్నేండ్లయినా భూమిలో కరుగుతలే..
- ఆల్టర్నేట్గా కంపోస్టేబుల్ కవర్ల వినియోగం
- 180 రోజుల్లో భూమిలో కలుస్తాయంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు:120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వినియోగంపై బల్దియా సీరియస్యాక్షన్కు సిద్ధమవుతున్నది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిషేధం విధించిన ప్లాస్టిక్‌కవర్ల వినియోగం కొనసాగుతుండడంతో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని బల్దియా నిర్ణయించింది. రోజూ ఏదో ఒక రూపంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ డంపింగ్‌యార్డుకి చేరుతుండడం, ఎంతకాలమైనా భూమిలో కరగకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
గ్రేటర్‌లో - కోటి20 లక్షలకుపైగా జనాభా ఉండగా, కుటుంబాలు 25 లక్షలకుపైగానే ఉన్నాయి. వీరి నుంచి రోజూ వస్తున్న ప్లాస్టిక్ కవర్లు -75 లక్షలకుపైగానే ఉంటున్నాయని అధికారుల అంచనా. రోజూ గ్రేటర్ లో దాదాపు 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 25 నుంచి 30 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. ఇంట్లోకి తీసుకువచ్చే పండ్లు, కూరగాయలు, కిరాణ సామగ్రి, చికెన్, మటన్ఇలా ప్రతీది 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్కవర్లలోనే తెస్తున్నారని బల్దియా గుర్తించింది.
13 ఏండ్ల కింద 20 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్కవర్లను వాడొద్దని నిబంధన విధించగా, తర్వాత 40 మైక్రాన్లు, అనంతరం 50 , మూడేండ్ల కింద 75, ప్రస్తుతం 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్లను వాడొద్దని నిషేధం విధించింది. అయినప్పటికీ నిషేధం విధించిన ప్లాస్టిక్ వినియోగం తగ్గడంలేదు. వాటిని ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడేస్తుండటంతో రోడ్ల పక్కన, నాలాలు , డంపింగ్‌యార్డులు సైతం ఆ కవర్లతో నిండిపోతున్నాయి. భూమిలో కరగకుండా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయి.
త్వరలో స్పెషల్ డ్రైవ్..
గ్రేటర్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు గతంలో కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఐదేండ్ల క్రితం కొన్నాళ్లు అధికారులు పలు షాపుల్లో వరుస తనిఖీలు నిర్వహించి పకడ్బందీగా అమలు చేశారు. తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడంతో మళ్లీ ప్లాస్టిక్‌కవర్ల వినియోగం పెరిగింది. దీంతో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ మాత్రమే వినియోగించాలంటూ జీహెచ్ఎంసీ త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు రెడీ అయ్యింది. ఎక్కువ శాతం కవర్లు చిరువ్యాపారుల నుంచే వస్తుండడంతో ముందుగా వారికి అవగాహన కల్పించనున్నారు.
అయినా, మారకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. మొదటిసారి దొరికితే వ్యాపారికి రూ.10 వేల వరకు, రెండోసారి రూ.25 వేల వరకు ఫైన్లు వేయనున్నారు. మూడోసారి కూడా దొరికతే మెటీరియల్ ను బట్టి రూ.25 వేలపై నుంచి లక్ష వరకు ఫైన్ వేసి షాపులోని స్టాక్ సీజ్ చేసే ప్లాన్చేస్తున్నారు. ఎక్కడైనా నిషేధిత ప్లాస్టిక్వినియోగిస్తున్నట్లు తెలిస్తే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040–-21111111 కు కాల్ చేసి చెప్పాలని కోరుతున్నారు.
కంపోస్టేబుల్ కవర్ల వినియోగంపై దృష్టి
ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కంపోస్టేబుల్ కవర్ల వినియోగంపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. ఈ తరహా కవర్లు 180 రోజుల్లో భూమిలో కలిసిపోతాయి. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలగదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన హాస్పిటళ్లు, బేకరీలు, పేరొందిన రెస్టారెంట్లు వీటిని ఉపయోగిస్తున్నాయి. అంతలా ఇటువంటి కవర్లు వినియోగిస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చని ఉన్నతాధికారుల ఆలోచన. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈ కవర్ల వినియోగంపై కూడా అవగాహన కల్పించున్నారు.