హైదరాబాద్ లో వచ్చేవారం ఇందిరమ్మ చీరల పంపిణీ

హైదరాబాద్ లో వచ్చేవారం ఇందిరమ్మ చీరల పంపిణీ
  • ఇందిరా మహిళా శక్తి పేరుతోబతుకమ్మ లోపు పంచనున్న బల్దియా
  • హ్యాండ్ లూమ్స్ డిపార్టుమెంట్ నుంచి జీహెచ్ఎంసీకి చేరిన ఐదు లక్షల చీరలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చేవారం నుంచి గ్రేటర్​లో చీరలను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.  ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ పండుగకి ముందుగానే  చీరలను  పంపిణీ  చేయనున్నారు. తెలంగాణ హ్యాండ్ లూమ్స్ డిపార్టుమెంట్ నుంచి సోమవారం జీహెచ్ఎంసీకి చీరలు చేరాయి.  సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ చీరలను అందజేయనున్నారు. మొత్తం  గ్రేటర్ లో 49,714  గ్రూప్ లు ఉన్నాయి.  

ఒక్కో గ్రూప్ లో 10 మంది చొప్పున మహిళలు ఉన్నారు. మొత్తం జీహెచ్ఎంసీకి 5 లక్షల చీరలు వచ్చాయి. ఈ నెల 21 నుంచి  బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందుగానే ఈ చీరల పంపిణీ జరగనుంది. 

అయితే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈసారి రూ.800 ఖరీదు చేసే చీరలు పంపిణీ చేస్తుంది. ప్రతి చీరకు ప్రత్యేకంగా ఓ కవర్ లో అందిచనున్నారు. అయితే బతుకమ్మ పండుగకి ముందుగా ఒక చీర పంపిణీ చేస్తుండగా, సంక్రాంతికి కూడా మరో చీర అందించనున్నట్లు తెలిసింది.