- జీఐఎస్ సర్వే డేటాతో లింక్
- ఆస్తి సమాచారంతో పాటు అలర్ట్‌లు, రిమైండర్లు పంపనున్న ఏఐ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆస్తి పన్ను వసూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగించాలని జీహెచ్ఎంసీ ప్లాన్చేస్తున్నది. ప్రస్తుతం బిల్ కలెక్టర్లు వసూలు చేయడమో లేక ప్రాపర్టీదారులు ఆన్లైన్లో చెల్లించడమో నడుస్తోంది. అయితే, భవిష్యత్తులో ఏఐ సేవలు ఉపయోగించుకుని ఎక్కువ ఆస్తి పన్ను వసూలు చేయాలని బల్దియా ఆలోచన చేస్తున్నది. నగరంలో కొంతకాలంగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే(జీఐఎస్) చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లతో పాటు ఫిజికల్ సర్వే చేస్తూ ఫొటోలు, ఇతర డేటా సేకరిస్తున్నారు. ఇది ప్రస్తుతం తుది దశలో ఉండగా పూర్తి కాగానే ఏఐతో లింక్ చేయనున్నారు.
ఈ సర్వే సమాచారాన్ని యజమానికి కూడా అందుబాటులో ఉంచనున్నారు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఐటీ ఎలా కడతామో, వాడుకున్న కరెంట్‌కు బిల్లు ఎలా చెల్లిస్తామో.. అలాగే జీఐఎస్డేటా ఆధారంగా చెల్లించాల్సిన ఆస్తి పన్ను గురించి ఈ ఏఐ ఎప్పటికప్పుడు రిమైండర్లు పంపిస్తుంది. ఓనర్ కు ఆస్తికి సంబంధించిన వివరాలతో పాటు త్రీడీ విజువల్స్, ఇంటి మ్యాప్, విస్తీర్ణం, చెల్లించాల్సిన ట్యాక్స్, ఎప్పుడు ఆఖరి తేదీ ఉంది లాంటి వివరాలను అలర్ట్ ల రూపంలో సెండ్చేస్తుంది. ఒకవేళ అదనపు అంతస్తులు కట్టినా, యూసేజీ మారినా, రెసిడెన్షియల్ ప్రాపర్టీకి కమర్షియల్ కరెంట్ మీటర్లు పెట్టినా ఆటోమెటిక్ గా కమర్షియల్ పరిధిలో వచ్చి ఆస్తి పన్ను మారేలా ప్లాన్ చేశారు.
ఏటా వస్తున్న ఆస్తి పన్ను ఇలా..
2025–26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్‌ను రూ.3వేల కోట్లుగా పెట్టుకున్నది. ఏటా సెప్టెంబర్ లో టార్గెట్ ఫిక్స్ చేస్తున్నప్పటికీ ఈ ఏడాది జులైలోనే కమిషనర్ కర్ణన్ లక్ష్యం ఫిక్స్ చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2 వేల కోట్లు టార్గెట్ పెట్టుకోగా, రూ.2038.42 కోట్లు వచ్చింది. 2023–24 లో రూ.1915 కోట్లు, 2022–23లో రూ.1658 కోట్లు, 2021–22లో రూ.1681 కోట్లు, 2020–21లో రూ.1633 కోట్లు వచ్చాయి.
ఈసారి ఇప్పటికే రూ.1450 కోట్లు వసూలైంది. గతేడాది నవంబర్ వరకు అయిన ట్యాక్స్ కలెక్షన్ తో పోలిస్తే ఈ ఏడాది రూ.100 కోట్లు అధికంగా వచ్చింది. ఈసారి కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ రెసిడెన్షియల్ పన్ను కడుతున్న వారి ట్యాక్స్ కూడా రివైజ్ చేయనుండడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం ఉందని కమిషనర్కర్ణన్ధీమా వ్యక్తం చేస్తున్నారు.
