
- త్వరలో అమల్లోకి బల్దియా కొత్త విధానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులను సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేందుకు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం ఉన్నప్పటికీ కొంతమంది ప్రాపర్టీ యజమానులు వెబ్సైట్లో లాగిన్ అయి.. అందులో యూపీఐ చెల్లింపులు చేయడానికి గందరగోళానికి గురవుతున్నారు. అలాగే ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన లేనివారు జీహెచ్ఎంసీ కస్టమర్ సర్వీస్ సెంటర్లలో చెల్లింపులు చేస్తున్నారు.ఈ సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై కరెంట్ బిల్లు, మొబైల్ రీచార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల మాదిరిగా యూపీఐ ప్లాట్ఫామ్స్(ఫోన్‌పే, గూగుల్ పే వంటివి) ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులపై రిమైండర్‌లు (అలర్ట్‌లు) వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు ఆప్షన్‌ను జోడించి, ప్రాపర్టీ నంబర్ ఎంటర్ చేసి నేరుగా చెల్లింపు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఈ విధానం త్వరలో అమలులోకి రానుంది.