హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి 2024తో పోలిస్తే 2025లో ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 11,166 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, 2,401 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ), 30 లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు జారీ చేశారు. ఇందులో 103 హైరైజ్ భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.1,272.36 కోట్ల ఆదాయం వచ్చింది.
2024లో 11,855 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి 2,125 ఓసీలు జారీ చేసి రూ.1,114.24 కోట్లు ఆదాయం సాధించారు. 2025లో హైరైజ్ భవనాలకు అనుమతులు 103కు చేరగా, గతేడాది ఈ సంఖ్య కేవలం 69 మాత్రమే. నాన్ హైరైజ్ భవనాలు 2,381 ఉన్నాయి. అనుమతి పొందిన భారీ ప్రాజెక్టుల్లో 50 అంతస్తుల వరకు ఉన్న భవనాలు ఉన్నాయి. అత్యధికంగా 55 ఫ్లోర్ల రెండు రెసిడెన్షియల్ భవనాలకు అనుమతులు ఇచ్చారు.
