జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట కార్మికుల ధర్నా

జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట కార్మికుల ధర్నా

తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళుతామని జీహెచ్ఎంసీ యూనియన్ నాయకులు హెచ్చరించారు. కార్మికుల జీతాలు కట్ చేయడం వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నుంచి రోడ్లపై కష్టపడి పనులు చేస్తే.. ఇబ్బందుల పాలు చేస్తారా ? అంటూ వారు కన్నెర్ర చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బల్దియా ఆఫీసు ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. 6 జోనల్ ఆఫీసుల ముందు నిరసన నిర్వహించిన ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఇవాళ చలో ప్రగతి భవన్ కు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.

ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న యూనియన్ నాయకులు, కార్మికులతో v6 ముచ్చటించింది. దుమ్ము, ధూళితో కడుపు నింపుకుంటారని, పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఉన్న ఉద్యోగాలు తీసివేశారని ఆరోపించారు. బయో మెట్రిక్ మెషిన్ లను అద్దెకు తీసుకొచ్చారని ఇందుకు రూ. 90 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఇదోక స్కాంగా కనిపిస్తోందని ఆరోపించారు. బయో మెట్రిక్ మెషిన్ లు చెడిపోతే..వారి జీతాలు ఎలా అని ప్రశ్నించారు. ఇలా మొత్తం జీతాలు కట్ చేశారని తెలిపారు. న్యాయంగా డ్యూటీ చేసిన వారికి జీతం చెల్లించాలని, ఏదైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చన్నారు. రామ్ కీ తో జీహెచ్ఎంసీ చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే... పెండింగ్ లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. గతంలో జీహెచ్ఎంసీ కార్మికుల విషయంలో ఎన్నో హామీలు చేశారని.. ఇప్పటికీ ఒక్కటి కూడా హామీ అమలు కాలేదన్నారు.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెలోకి వెళుతామని హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ఉందని, తాము సమ్మెలోకి వెళితే.. ప్రజలు కష్టాలు పడుతారని..దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్మికులు మాట్లాడుతూ.. తాము కష్టపడి పని చేస్తే.. జీతాలు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము స్కూళ్లు ఫీజులు కట్టలేక, ఇళ్ల కిరాయిలు చెల్లించలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. వెంటనే తమ జీతాలు ఇప్పించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని.. అలాగే జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.