29న వర్చువల్​గా బల్దియా  కౌన్సిల్ మీటింగ్

29న వర్చువల్​గా బల్దియా  కౌన్సిల్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు బల్దియా కౌన్సిల్​ సమావేశం వర్చువల్​గా జరగనుంది. మేయర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఇదే తొలి సమావేశం కానుంది. వర్చువల్ మీటింగ్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్​ను వెబెక్స్ సంస్థ రూపొందించింది. ఒక్కో సభ్యుడికి యూజర్​ ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కౌన్సిల్​ సభ్యులకు ఇప్పటికే సమాచారాన్ని అందించారు. వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిన సమావేశం నిర్వహించడం స్థానిక సంస్థల చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో2021-–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కౌన్సిల్​ ఆమోదించనుంది. ఇదివరకే స్టాండింగ్ కమిటీ అప్రూవల్​ పొందిన పలు పనులను ఆమోదించనున్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పటికే సభ్యులకు సమాచారం అందించారు. ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉండదని తెలుస్తోంది. సభ్యులందరికి మాట్లాడే అవకాశం కూడా ఉంటుందా? లేదా అనేది కూడా సందేహంగా మారింది.  కరోనా రూల్స్ పాటిస్తూ ప్రత్యక్ష సమావేశం నిర్వహించి ఉంటే పలు సమస్యలపై చర్చించే అవకాశం ఉండేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు.  వర్చువల్ మీటింగ్ వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు, అధికారులు మొత్తం 240 మంది వరకు పాల్గొననున్నారు. 
హెడ్డాఫీసులో మేయర్, డిప్యూటీ మేయర్
జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్డాఫీసు ఏడో ఫ్లోర్​లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కమిషనర్ లోకేశ్​ కుమార్, అడిషనల్ కమిషనర్లు, పలువురు ఉన్నతాధికారులు మీటింగ్​లో పాల్గొననున్నారు. ముందుగా లింగోజిగూడ బై ఎలక్షన్​లో కార్పొరేటర్​గా గెలుపొందిన రాజశేఖర్ రెడ్డితో బల్దియా హెడ్డాఫీసులో మేయర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  2021-–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.5,600 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్రేటర్​ ఎన్నికలకు ముందే అప్పటి స్టాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆమోదించింది. తర్వాత జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీలోనూ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. ఎన్నికల ముందు మీటింగ్ పెట్టాలని అనుకున్నప్పటికీ కోడ్ అమల్లోకి రావడంతో అది కూడా కుదరలేదు.  కొత్త కౌన్సిల్​ ఏర్పడి నాలుగు నెలలు దాటుతున్నా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేదు. ఇప్పుడు వర్చువల్​గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఈ సమావేశంలో తొలి ఎజెండాగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాన్ని చేర్చారు.  
క్వశ్చన్ అవర్ లేకపోవడంతో..
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు సైతం కౌన్సిల్ మీటింగ్​లో ఎన్నో సమస్యలపై ప్రశ్నించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. కానీ వర్చువల్​గా సమావేశం నిర్వహిస్తుండటం, క్వశ్చన్ అవర్ లేకపోవడంతో తమ డివిజన్ల సమస్యలను ఎలా చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కనీసం నాలాల పూడికతీత పనులు కూడా జరగడంలేదని, రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన విషయాలపై చర్చిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు అంటున్నారు. నామ్ కే వాస్తే గా సమావేశాలు పెట్టడం సరికాదంటున్నారు.
 ప్రత్యక్ష సమావేశమే పెట్టాలి: బీజేపీ కార్పొరేటర్లు
బల్దియా కౌన్సిల్ మీటింగ్​ను వర్చువల్​గా నిర్వహిస్తుండటంతో బీజేపీ కార్పొరేటర్లు శనివారం మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. ప్రత్యక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. అందుకు మేయర్ అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి బీజేపీ స్టేట్ ఆఫీసుకు వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిశారు. బల్దియా కౌన్సిల్ మీటింగ్​పై ఆయనతో చర్చించారు. అనంతరం  జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ మొదటి సాధారణ సమావేశాన్ని ప్రత్యక్షంగానే నిర్వహించాలని కోరుతూ బీజేపీ కార్పొరేటర్లు  బల్దియా కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకేశ్​కుమార్​కు లెటర్ రాశారు.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిందని, లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా ఎత్తివేశారని అందులో పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి పేరుతో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగుల్లో పాల్గొంటున్నారన్నారు. రాజకీయ సమావేశాలపై ఇప్పుడు నిషేధం లేదని, అలాంటప్పుడు  బల్దియా మీటింగ్ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి బల్దియా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆన్​లైన్​ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తి స్థాయిలో చర్చించలేమన్నారు.
ఆన్​లైన్ సమావేశాల్లో 
ప్రజా సమస్యలపై చర్చించలేం 
కరోనా సాకుతో కౌన్సిల్​ మీటింగ్​ను వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. ఆన్​లైన్ సమావేశాల్లో చర్చలు  సాధ్యం కాదు. కరోనా రూల్స్ పాటిస్తూ కౌన్సిల్ మీటింగ్ పెడితే ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలుండేది.  బల్దియా ఆఫీసులో స్థలం సరిపోకపోతే ఫంక్షన్ హాల్ లేదా ఏదైనా కన్వెన్షన్​లో మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు.  సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంపై కనీసం పార్టీల వారీగా చర్చించి ఉంటే సలహాలు ఇచ్చే వాళ్లం. ఇటువంటి సమావేశాల వల్ల జనానికి నష్టం జరుగుతుంది. 
- దేవర కరుణాకర్, కార్పొరేటర్,  గుడిమల్కాపూర్ డివిజన్  
సమాధానాలు చెప్పలేకనే..  
మేం అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం వల్లే
వర్చువల్​గా కౌన్సిల్​ మీటింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొత్త కౌన్సిల్ ఏర్పడి 4 నెలలు దాటినా కరోనా ఎఫెక్ట్​తో మీటింగ్ పెట్టలే. ఇన్ని రోజుల తర్వాత వర్చువల్ గా మీటింగ్ పెట్టడం సరికాదు. కరోనా రూల్స్ పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఒక్కరోజు మాత్రమే జరిగే కౌన్సిల్ మీటింగ్​ను ప్రత్యక్షంగా పెట్టడం ఎందుకు వీలు కాదు. కౌన్సిల్ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేసి, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రత్యక్షంగా మీటింగ్ పెడితే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశముండేది.
- తోకల శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్, 
  మైలార్​దేవ్ ​పల్లి డివిజన్
కరోనా కారణంగానే 
వర్చువల్ మీటింగ్
 కరోనా ఎఫెక్ట్ కారణంగానే వర్చువల్​ మీటింగ్​ పెట్టాలని నిర్ణయించాం.  కార్పొరేటర్లు ఇంటి నుంచే వర్చువల్​గా  కౌన్సిల్ మీటింగ్​లో పాల్గొనవచ్చు. డివిజన్లలో ఏ సమస్యలున్నా పార్టీలకతీతంగా కార్పొరేటర్లు నేరుగా తన దృష్టికి తీసుకొస్తే  వాటిని తప్పకుండా పరిష్కరిస్తా.
 – మేయర్​ గద్వాల విజయలక్ష్మి