Tesla Model Y ఈవీలకు కనిపించని గిరాకీ.. పాత స్టాక్ వదిలించుకోవటానికి రూ.2 లక్షలు డిస్కౌంట్

Tesla Model Y ఈవీలకు కనిపించని గిరాకీ.. పాత స్టాక్ వదిలించుకోవటానికి రూ.2 లక్షలు డిస్కౌంట్

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజం టెస్లాకు భారత మార్కెట్లో మనుగడ గట్టి సవాలు ఎదురవుతోంది. భారత్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో భారీ క్రేజ్ సంపాదించినప్పటికీ.. అమ్మకాల విషయంలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో స్టాక్‌ను క్లియర్ చేసేందుకు టెస్లా తన మోడల్ Y కార్లపై ఏకంగా రూ.2లక్షల వరకు భారీ తగ్గింపులతో ముందుకొచ్చింది. అయితే ఈ తగ్గింపు సెలెక్టెడ్ మోడళ్లకు మాత్రమే అంటోంది టెస్లా ఇండియా.

గతేడాది టెస్లా భారత్‌కు దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 300 కార్లలో దాదాపు మూడో వంతు అంటే దాదాపు100 కార్లు ఇప్పటికీ అమ్ముడుపోకుండా గోదాములకే పరిమితమయ్యాయి. దీనికి గల ప్రధాన కారణాలను గమనిస్తే.. ప్రారంభంలో ఎంతో ఉత్సాహంగా బుక్ చేసుకున్న వారు, ఇప్పుడు డెలివరీ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అలాగే విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నందున  దాదాపు 110% ఇంపోర్ట్ డ్యూటీ ఉండటం మరో కారణం. దీనివల్ల అమెరికాలో రూ.35-40 లక్షలు ఉండే కారు.. ఇండియాలో దాదాపు రూ.60-70 లక్షల వరకు పలుకుతోంది. ఇదే ధరలో BMW iX1 లేదా చైనా దిగ్గజం BYD Sealion 7 వంటి సంస్థలు మెరింత బెస్ట్ ఫీచర్లు, లోకల్ సర్వీస్ ఫెసిలిటీ అందిస్తున్నాయి.

ALSO READ : నిమిషం లేటయితే అరగంట జీతం కట్..

పాత స్టాక్‌ వదిలించుకోవడానికి టెస్లా ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తోంది. సాధారణంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయకుండా.. కేవలం ఆసక్తి ఉన్న కస్టమర్లకు, టెస్ట్ డ్రైవ్ కోరే వారికి మాత్రమే ఈ రూ.2 లక్షల తగ్గింపు ఆఫర్‌ను నేరుగా ఇస్తోంది. ముఖ్యంగా తక్కువ రేంజ్ ఉన్న ఎంట్రీ లెవల్ మోడల్ Y వేరియంట్లపైనే ఈ డిస్కౌంట్లు ఎక్కువగా ఉన్నాయి.

టెస్లా స్ట్రగుల్ అవుతున్న వేళ.. ఇతర లగ్జరీ ఈవీ కార్ మేకింగ్ కంపెనీలు భారత్‌లో దూసుకుపోతున్నాయి. బీఎమ్‌డబ్ల్యూ అమ్మకాలు గత ఏడాది 200 శాతం పెరిగి 3వేల700 యూనిట్లకు చేరుకున్నాయి. భారత్‌లోనే అసెంబ్లీ చేయడం వల్ల కంపెనీలు తమ కార్ల రేట్లను అదుపులో ఉంచగలుగుతున్నాయి. టెస్లా కూడా భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే తప్ప.. ఈ పోటీలో గెలవడం కష్టమని ఆటో నిపుణులు అంటున్నారు.