- రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న మంత్రి పొన్నం
- అత్యంత పరిశుభ్ర నగరంగా నవీ ముంబై
- ప్రత్యేక విభాగాల్లో అగ్రస్థానంలో రేవా, రుద్రపూర్
న్యూఢిల్లీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. దేశంలో అత్యుత్తమ పారిశుధ్య ప్రమాణాలు పాటిస్తూ, స్వచ్ఛతలో మేటిగా నిలిచిన నగరాల సరసన చేరింది. పరిశుభ్రత, పట్టణ పారిశుధ్యంలో మంచి స్కోర్ తో నగరాలు, పట్టణాలకు ఇచ్చే ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–-26’ పురస్కారాన్ని సొంత చేసుకుంది.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 10వ ఎడిషన్ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అవార్డు ను అందుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ‘స్వచ్ఛతా కీ నయీ పహల్- బఢాయే హాథ్, కరే సఫాయీ సాథ్’ (స్వచ్ఛతకు కొత్త అడుగు- చేతులు కలుపుదాం, కలసి శుభ్రం చేద్దాం) అనే సందేశంతో ఈ ఎడిషన్ను కేంద్రం చేపట్టింది.
4,751కి పైగా నగరాలకు విస్తరణ
2016లో కేవలం 73 పట్టణ స్థానిక సంస్థలతో ప్రారంభమైన ఈ పారిశుధ్య ఉద్యమం10వ ఎడిషన్ నాటికి ఏకంగా 4,751కి పైగా నగరాలకు విస్తరించింది. చెత్త వేరు చేయడం, రవాణా, రీసైక్లింగ్, నదీ తీరాలు, పర్యాటక ప్రాంతాల పరిశుభ్రత, పారిశుధ్య కార్మికుల సంక్షేమం లాంటి 10 కీలక విభాగాల్లో 43 సూచికల ఆధారంగా నగరాలను అంచనా వేశారు. 3,000 మందికి పైగా శిక్షణ పొందిన అసెసర్లు జీపీఎస్ సాంకేతికతతో ప్రత్యక్షంగా తనిఖీలు చేసి డేటాను నమోదు చేశారు.
జోడీ ప్రోగ్రామ్ వల్ల వెనుకబడిన పట్టణాల్లో ప్రత్యక్ష పరిశుభ్రత (విజిబుల్ క్లీన్లీనెస్) 48% నుంచి 70% కి, ఇంటింటికీ చెత్త సేకరణ 52% నుంచి 74% కి, మురుగునీటి నిర్వహణ 32% నుంచి 53% కి పెరిగింది. మొత్తం 10,500 మార్కులతో 10 ప్రధాన విభాగాల్లో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26 నగరాలను అంచనా వేశారు. జీహెచ్ఎంసీకి అవార్డు లభించడంహైదరాబాద్ నగర ప్రజలకు గర్వకారణమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
అత్యంత పరిశుభ్ర నగరాలివే..
‘స్వచ్ఛ సహర్ లీగ్’ విభాగంలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో సూరత్, విజయవాడ అవార్డులు అందుకున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ లోని రేవా అత్యంత పరిశుభ్రమైన పట్టణంగా నిలచింది. ఆ తర్వాత బిలాస్ పూర్, వారణాసి రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. అత్యంత పరిశుభ్రమైన హిమాలయ నగరంగా రుద్రపూర్ జాతీయ స్థాయిలో మెరవగా.. జమ్మూ ఈ విభాగంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
