
చందానగర్, వెలుగు: నాలాలో పడి జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ఓ కార్మికురాలు మృతిచెందింది. చందానగర్పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి కూరగాయల మార్కెట్ వెనక వైపు ఉన్న నాగులమ్మ దేవాలయం సమీప నాలాలో మహిళ మృతదేహం ఉందని బుధవారం రాత్రి 10.30 గంటలకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు.
పర్సులో ఫోన్, బంగారు కమ్మలు, ఇతర వస్తువులు గుర్తించారు. మృతురాలిని పాత లింగంపల్లికి చెందిన టి.యాదమ్మ(45)గా గుర్తించారు. ఆమె జీహెచ్ఎంసీలో కార్మికురాలిగా పని చేస్తోందని చెప్పారు. మద్యం తాగే అలవాటు ఉన్న యాదమ్మ ప్రమాదవశాత్తు నాలాలో పడి చనిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి కుమారుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.