మేయర్ చుట్టూ తిరుగుతున్నా.. డ్యూటీలోకి తీసుకోవట్లే

మేయర్ చుట్టూ తిరుగుతున్నా.. డ్యూటీలోకి తీసుకోవట్లే


హైదరాబాద్​, వెలుగు: రెండు నెలలుగా పని  చేస్తూనే మేయర్, అధికారుల చుట్టూ  తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బల్దియా కార్మికులు రమాదేవి, భారతి వాపోయారు.  కార్మికులు సీపీఎం సిటీ సెక్రటరీ శ్రీనివాస్ తో కలిసి సోమవారం కమిషనర్​కి వినతిపత్రం అందజేశారు. కొద్ది నెలల కిందట పంజాగుట్టలో మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన చేయగా​ వీరు డ్యూటీకి రాకపోవడం గమనించారు.  దీంతో మేయర్​ వారి స్థానంలో తన కారు డ్రైవర్ భార్య, తన తండ్రి ఎంపీ కేశవరావు కారు డ్రైవర్ తల్లిని నియమించడంతో  ఉద్యోగాలు  కోల్పోయామని రమాదేవి, భారతి ఆరోపించారు. గత ఏప్రిల్ 20న  కరోనా బారిన పడి సొంతూరు ఖమ్మం ఆస్పత్రిలో చేరినట్టు భారతి తెలిపారు. తనకు ఆసరాగా ఉండేందుకు తన కూతురు రమాదేవిని కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. చికిత్స పొందుతున్న సమాచారం అధికారులకు అందించామని, అయినా తమ స్థానంలో గత నెల 22న కొత్త వారిని ఎలా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్మికులకు మద్దతుగా యూనియన్​ సంఘాలతో పాటు పలు పార్టీల నేతలు అండగా నిలిచారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ మజ్దూర్​మోర్చా సిటీ చైర్మన్, గ్రేటర్​ ఎంప్లాయీస్​యూనియన్ ప్రెసిడెంట్​గోపాల్​ డిమాండ్​ చేశారు.  తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినందునే  తొలగించినట్టు సర్కిల్–18 డిప్యూటీ కమిషనర్ తెలిపారు.  బయో మెట్రిక్ లో అక్రమంగా హాజరైనట్టు ఎస్ఎఫ్ఏ సాయిబాబా నమోదు చేశాడని, దీనిపై విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో తొలగిస్తూ ఆదేశాలను జారీ చేశామని డిప్యూటీ కమిషనర్ వివరించారు.