మధ్యలోనే ఆగిపోయిన జెయింట్ వీల్.. 50మంది గాల్లోనే

మధ్యలోనే ఆగిపోయిన జెయింట్ వీల్.. 50మంది గాల్లోనే

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపం కారణంగా జెయింట్ వీల్ రైడ్ పనిచేయడం ఆగిపోయింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయిందని, పై బోనుల్లో ఉన్న వ్యక్తులు దాదాపు అరగంట పాటు అక్కడే చిక్కుకుపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించి సాంకేతిక సిబ్బంది సహాయంతో సహాయక చర్యలపై నిర్వాహకులు దృష్టి సారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 20 మందిని రక్షించామన్నారు. వీరిలో నలుగురు పురుషులు, పన్నెండు మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

అంతకుముందు గుజరాత్‌లోని ఓ ఉత్సవంలో ఒక అమ్మాయి జుట్టు ఫెర్రిస్ వీల్‌లో ఇరుక్కుపోయింది. ఈ వీడియోను పంచుకున్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రకారం, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియా పట్టణంలో గణేష్ చతుర్థి సందర్భంగా ఓ జాతరలో ఈ సంఘటన జరిగింది. రైడ్‌లో కూర్చున్న అమ్మాయి, తన జుట్టు విప్పి ఉండడంతో అది.. జెయింట్ వీల్ చక్రాల మాస్ట్‌లలో ఒకదానిలో చిక్కుకోవడంతో ఆమె కేకలు వేసింది. అది చూసిన వెంటనే రైడ్‌ను నిలిపివేసి ఇతర వ్యక్తులను అక్కడి నుంచి తరలించారు.