గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకువస్తున్నది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో కేబినెట్ముందుకు రానుంది. ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ -ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు --–-2025’ పేరిట రూపొందుతున్న ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్‌వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. ఇకపై గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్, డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు గిగ్‌వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వీరు కార్మిక చట్టాల పరిధిలోకి రాకపోవడంతో.. వారి పనిగంటలు, ఆదాయం, ఉద్యోగ భద్రత వంటి అంశాలను ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా చేయబోయే చట్టం వల్ల వారికి జాబ్ సెక్యూరిటీతో పాటు సంక్షేమానికి ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటవుతుంది. ఆరోగ్య బీమా, యాక్సిండెంట్ కవరేజీ, ఆదాయ భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలవుతాయి.
2047 నాటికి దేశంలో 6.16 కోట్ల గిగ్ వర్కర్లు
వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం వ్యవసాయేతర కార్మికశక్తిలో గిగ్ వర్కర్లు 2.6% (2020–21) మాత్రమే ఉన్నారు. కానీ 2047 నాటికి ఇది 14.89 శాతానికి పెరగనుంది. టెక్నాలజీ విస్తరణ, సౌలభ్యత, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు వస్తున్న ఆదరణ, ప్రాజెక్ట్ ఆధారిత ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి లాంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. 2020–21 నాటికి దేశంలో సుమారు 77 లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారు.
2047 నాటికి ఈ సంఖ్య 6.16 కోట్లకు చేరుతుంది. ఇది ఏకంగా ఏడు రెట్ల వృద్ధి. ఇటు గిగ్ ఎకానమీ కూడా 2030 నాటికి దేశ జీడీపీలో 1.25%, 2047 నాటికి 4% వరకు వాటాకు చేరే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్, ఫుడ్ సప్లయ్ వంటి సంప్రదాయ రంగాలతోపాటు ఇప్పుడు హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, మార్కెటింగ్, డిజైన్, క్రియేటివ్ సర్వీసెస్ వంటి రంగాల్లో కూడా గిగ్ వర్కర్లకు భారీ అవకాశాలు వస్తున్నాయి. మహిళలు, యువత, టయర్ -2, టయర్ -3 నగరాల ప్రజలు ఈ రంగంలో కొత్తగా అడుగుపెడుతున్నారు.
