
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో చివరి రోజు అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంపై ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, తాను మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతోనే తమకు ఈ నమ్మకం వచ్చిందన్నాడు. ‘140 ఓవర్ల పాటు ఒకే దృక్పథంతో ఉండటం కష్టం. అదే గొప్ప జట్టు లక్షణం. ఈ రోజు మేము అది చూపించాం. అందుకే మాది గొప్ప జట్టు. జడేజా, సుందర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా వాళ్లు ప్రశాంతంగా ఆడి సెంచరీలు చేయడం గొప్ప విషయం’ అని గిల్ పేర్కొన్నాడు.
పంత్ ప్లేస్‌లో జగదీశన్
ఇంగ్లండ్‌తో గురువారం నుంచి జరిగే ఐదో టెస్టు నుంచి కీపర్ రిషబ్ పంత్ తప్పుకున్నాడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఎన్. జగదీశన్ జట్టులోకి వచ్చాడని తెలిపింది. జగదీశన్ ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్నాడు. మరోవైపు ఐదో టెస్టు కోసం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జెమీ ఓవర్టన్‌ను తమ జట్టులోకి తీసుకున్నట్టు ప్రకటించింది.