ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా సమక్షంలో ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. మెలోని సొంత పార్టీకి తొమ్మిది క్యాబినెట్ పదవులు రాగా లీగ్, ఫోర్జా ఇటాలియా అనే మిత్రపక్షాలకు ఐదు చొప్పున మంత్రిత్వ శాఖలు కేటాయించారు. మొత్తం ఆమె క్యాబినెట్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన జార్జియా మెలోని తాజాగా జరిగిన ఎన్నికల్లో 26.37 % ఓట్లను సాధించారు. మిత్రపక్షాలు ఫోర్జా ఇటాలియా, లీగ్ పార్టీలతో కలిసి 43% ఓట్లతో ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వివాదాస్పద గాడ్, ఫాదర్ ల్యాండ్ అండ్ ఫ్యామిలీ నినాదాలతో జార్జియా మెలోని ప్రచారం నిర్వహించి విజయం సాధించారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
జార్జియా మెలోని రోమ్‌లో జన్మించారు. ఆమెకు ఏడాది వయస్సున్నప్పుడు తండ్రి ఫ్రాన్సెస్కో కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తల్లి వద్దనే మెలోని పెరిగింది. 2012లో ఆమె సొంతంగా పార్టీని స్థాపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ కేవలం 4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది.
