
నిజాంపేట, వెలుగు : ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా పైచదువులు వద్దని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్‌లో బుధవారం జరిగింది. నిజాంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహ్మద్ మదిహ (15) ఇటీవల టెన్త్ పూర్తి చేసింది. ఇంటర్ కోసం అప్లై చేయగా.. కామారెడ్డిలోని మైనార్టీ కాలేజీలో సీటు వచ్చింది.
అక్కడికి వెళ్లి చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా.. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చదువు వద్దని వారించారు. దీంతో మనస్తాపానికి గురైన మదీహ బుధవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు వచ్చిచూడగా అప్పటికే చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు నిజాంపేట ఎస్ఐ రాజేశ్ తెలిపారు.