భర్త గర్ల్‌ ఫ్రెండ్‌పై భార్య 498ఏ కేసు.. చెల్లదన్న హైకోర్టు

V6 Velugu Posted on Jul 26, 2021

అమరావతి: గర్ల్ ఫ్రెండ్ ను ఐపీసీ సెక్షన్ 498 ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం ) కింద విచారించడానికి వీల్లేదని అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్ ఫ్రెండ్ పై పోలీసులు 498 ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్టుతోపాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ సెక్షన్ కింద భర్త రక్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది. భర్త బంధువుల్లో గర్ల్ ఫ్రెండ్ రాదని , అందువల్ల ఆమెను 498 ఏ కింద విచారించడానికి వీల్లేదని తెలిపింది. 
కేసు పూర్వ పరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా దిశ పోలీసు స్టేషన్లో ఓ వివాహత .. తన భర్తతో సాన్నిహిత్యం కలిగి ఉన్న మహిళపై ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందంటూ పేర్కొంది. ఫిర్యాదు చేసిన వివాహిత... భర్తను మొదటి నిందితుడిగా, అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు. దిశ పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితురాలు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహిళ .. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు పిటిషనర్ బంధువు కాదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ పోలీసులు సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అన్నారు . 
వీటిని పరిగణలోకి తీసుకన్న న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ .. పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొన్నారు.
 

Tagged ap today, , amaravati today, ap highcourt latest orders, ap high court today updates, ap high court today trials, girl friend under section 498a

Latest Videos

Subscribe Now

More News