గర్ల్స్ కాలేజీలకు మస్తు డిమాండ్

గర్ల్స్ కాలేజీలకు మస్తు డిమాండ్

ఇంటర్‍ ఎడ్యుకేషన్‍ అంటేనే లక్షల్లో ఫీజులు గుర్తుకొస్తాయి. అందులోనూ ప్రైవేట్‍, కార్పొరేట్‍ ఆధిపత్యం ఉన్న ఇంటర్‍ విద్యలో ప్రభుత్వ జూనియర్‍ కాలేజీల్లో విద్యార్థులు రావడమే మహాభాగ్యంగా భావిస్తాం. అలాంటిది అడ్మిషన్ల కోసం వేచి చూడటం అంటే అసలు ఊహించగలమా. నిజంగా ఇదే జరిగుతుంది. అమ్మాయిలు ప్రభుత్వ జూనియర్‍ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలోని హుస్సేనీఆలం, ఫలక్‍నుమా తదితర జూనియర్‍ కాలేజీల్లో ముస్లిం యువతులు ఇంటర్‍ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మారేడ్‍పల్లి గర్ల్స్ కాలేజీలోనూ కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కూకట్‍ పల్లి గర్ల్స్ జూనియర్‍ కాలేజీలో అడ్మిషన్లకు వేచి చేస్తున్నారు. బాయ్స్, కో ఎడ్యుకేషన్‍ ఉన్న జూనియర్‍ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే గర్ల్స్ జూనియర్‍ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపుకు దగ్గర్లో ఉన్నట్లు జిల్లా ఇంటర్‍ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.

గతేడాది కంటే ఎక్కువ

ప్రభుత్వ జూనియర్‍ కాలేజీల్లో చేరేందుకు గర్ల్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్‍, కార్పొరేట్‍ ఇంటర్‍ కాలేజీలు ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ జూనియర్‍ కాలేజీల్లోనే అడ్మిషన్‍ పొందేందుకు వరుస కడుతున్నారు. కొన్ని కాలేజీల్లో అడ్మిషన్‍ పొందేందుకు వెయిటింగ్‍ లిస్ట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ ఇంటర్‍ కాలేజీల్లో అడ్మిషన్లు ఆశాజనకంగా జరుగుతున్నట్లు ఇంటర్‍బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది జులై 3 నాటికి 4603 అడ్మిషన్లు జరిగితే ఈ ఏడాది 5144 అడ్మిషన్లు పూర్తయినట్లు అధికారులు తెలియజేశారు.

రెండు షిఫ్టుల్లో నిర్వహణ

కూకట్‍పల్లి జూనియర్‍ కాలేజీలో 900 మంది విద్యార్థినులు చేరేందుకు సిద్ధంగా ఉన్నా వసతులు లేని కారణంగా కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అక్కడ ఉదయం ఇంటర్‍ కాలేజీ, మధ్యాహ్నం నుంచి డిగ్రీ కాలేజీ నడుస్తున్నందునా పరిమితంగానే అడ్మిషన్లు ఇస్తున్నారు.  మారెడ్‍పల్లి గర్ల్స్ జూనియర్‍ కాలేజీలో 750 మంది గర్ల్స్ కొత్తగా అడ్మిషన్లు పొందారు. హుస్సేనీ ఆలంలో గర్ల్స్ జూనియర్‍ కాలేజీలో రెండేళ్లకు చెందిన 1518 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.  వీరిలో ఫస్టియర్‍కు చెందిన 700 మంది స్టూడెంట్స్ ఉన్నారు.  ఫలక్‍నుమా జూనియర్‍ కాలేజీలోనూ అడ్మిషన్లు తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. ఇందులో 600 మంది గర్ల్స్ కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఇక్కడ స్థలాభావం కారణంగా ఉదయం గర్ల్స్ కి  ఆతర్వాత బాయ్స్ కు తరగతులు నిర్వహిస్తున్నారు. బీజేఆర్ గర్ల్స్ కాలేజీలోనూ 800 మంది కొత్తగా చేరారు.

తరగతి గదులు లేవు..

జిల్లా పరిధిలో ఉన్న 22 ప్రభుత్వ జూనియర్‍ కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్‍లు తీసుకునేందుకు ముందుకు వస్తున్నా సరైన వసతులు లేని కారణంగా కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడం లేదు. పలు కాలేజీల్లో పరిమితికి మించి అడ్మిషన్లు కల్పించారు. కొన్నింటిలో కో ఎడ్యుకేషన్‍ కారణంగా రెండు షిఫ్ట్ లలో తరగతులు నిర్వహిస్తూ సర్దుబాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటర్ విద్యకు మరిన్ని నిధులు కేటాయించాలని తద్వార ప్రైవేట్‍ కాలేజీలకు దీటుగా విద్యార్థులను సంఖ్యను పెంచేందుకు అవకాశం ఉంటుందని లెక్చరర్లు అభిప్రాయపడుతున్నారు.