కలలో కూడా ఆ వేధింపులే వెంటాడుతున్నయ్

కలలో కూడా ఆ వేధింపులే వెంటాడుతున్నయ్

పుట్టక ముందు తల్లి గర్భంలో, చనిపోయాక సమాధిలో మాత్రమే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుందంటూ ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ‘‘బంధువులు, స్కూల్ టీచర్లు, ఎవరినీ నమ్మలేం.  ఆడ పిల్లలకు స్కూల్‌లో కూడా భద్రత లేదు. టీచర్లనూ నమ్మలేం” అంటూ అందులో రాసింది. తమిళనాడులోని చెన్నైలో మూడ్రోజుల క్రితం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పదకొండో తరగతి చదువుతున్న ఆ బాలిక తన తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆలస్యంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. లైంగిక వేధింపుల కారణంగానే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని ఈ సూసైడ్ నోట్ ఆధారంగా తేలిందని, ఈ కోణంలో ఎంక్వైరీ మొదలుపెట్టి ఇప్పటికే ఓ యువకుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

కంటతడి పెట్టించేలా ఉన్న సూసైడ్ నోట్..

ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్ చూస్తే.. ఆమె పడిన వేదనకు ఎవరికైనా కంట్లో నీళ్లు తిరుగుతాయి. ‘‘స్టాప్ సెక్సువల్ హెరాస్‌మెంట్‌ (లైంగిక వేధింపలు ఆపండి)’’ అంటూ సూసైడ్‌ నోట్ మొదలుపెట్టిన ఆ బాలిక.. చాలా రోజులుగా తాను తీవ్రమైన మనోవేదన అనుభవిస్తున్నానని పేర్కొంది. ‘‘ఆడపిల్లలకు స్కూల్‌ కూడా సేఫ్ కాదు, టీచర్లను కూడా నమ్మలేం. నేను చదువుకోలేకపోతున్నా.. కనీసం నిద్రపోదామంటే కలలో కూడా ఆ వేధింపులే నన్ను వెంటాడుతున్నాయి” అని సూసైడ్‌ నోట్‌లో రాసింది. బంధువులను, తోటి వారిని, అసలు ఎవరినీ నమ్మలేమంటూ ఆ బాలిక తాను అనుభవించిన వేదనను పరోక్షంగా నొక్కి చెప్పింది.  తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ కొడుకులకు.. ఆడపిల్లలను గౌరవించడం నేర్పాలని సూసైడ్‌ నోట్‌లో రాసింది. భూమిపైకి రాకముందు తల్లి గర్భంలో, చనిపోయాక సమాధుల్లో మాత్రమే ఆడ పిల్లలకు సేఫ్టీ ఉంది, మరెక్కడా రక్షణ లేదంటూ ప్రాణాలు వదిలేసే ముందు సమాజంలో తనకెదురైన వేధింపులకు న్యాయం కావాలంటూ (జస్టిస్ ఫర్‌‌ మీ) సూసైడ్ నోట్ రాసింది.

చాలా మంది వేధించి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు

ఈ సూసైడ్ నోట్ ఆధారంగా ఆ బాలికను చాలా మంది లైంగికంగా వేధించడంతోనే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే గతంలో ఆ బాలికతో కలిసి చదివిన ఓ కుర్రాడి(21)ని అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు తెలిపారు. అతడిని విచారించగా.. తాను ఆ బాలికను వేధించిన విషయం ఒప్పుకున్నాడన్నారు. గతంలో ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతుండగా.. అదే స్కూల్‌లో తాను 11వ తరగతి చదివేవాడని అతడు పోలీసులకు తెలిపాడు. అయితే ఆ తర్వాత ఆ బాలిక వేరే స్కూల్‌లో చేరగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్‌ అయ్యారని, ఇద్దరూ కొన్ని నెలల పాటూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్లని చెప్పారు. అయితే అతడు కొంత కాలం నుంచి ఆ బాలికను వేధిస్తున్నట్లు ఫోన్ చాటింగ్ ఆధారంగా తేలిందని, అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు పంపి టార్చర్ చేసేవాడని వివరించారు. అయితే బాలిక సూసైడ్ నోట్‌లో బంధువులు, టీచర్లు, ఎవరినీ నమ్మలేం అని రాసిన నేపథ్యంలో మరింత మంది ఆమెను వేధించారేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.