బాలికలకు పలుపు తాళ్లు

 బాలికలకు పలుపు తాళ్లు
  •     ఏజెన్సీలో జోరుగా బాల్య వివాహాలు
  •     చిన్న వయసులోనే పెండ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు
  •     పేదరికం, ఆర్థిక పరిస్థితి, నిరక్షరాస్యతే కారణం
  •     ఏడాదిలో 24 వివాహాలను అడ్డుకున్న ఆఫీసర్లు

ఆసిఫాబాద్, వెలుగు: బడి మెట్లు ఎక్కాల్సిన బాలికలు పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. స్కూల్ బ్యాగులు వేసుకునే వయస్సులో మోయలేని బాధ్యతల భారాన్ని భరిస్తున్నారు. ఆడపిల్లను భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు చిన్నప్పుడే అత్తారింటికి సాగనంపుతూ వారి బంగారు భవిష్యత్తును బలి చేస్తున్నారు. అవగాహన లేక కొందరు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపితే.. మరి కొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే కూతుళ్లకు పెండ్లిళ్లు చేసి సాగనంపుతున్నారు. 

ఆఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడవుల జిల్లా ఆసిఫాబాద్​లో బాల్య వివాహాలు ఆగడంలేదు. గతేడాది నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 24 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఆసిఫాబాద్​లో 4 , పెంచికల్ పేట్ మండలంలో 4, వాంకిడిలో 4,  బెజ్జూర్ 3, కాగజ్ నగర్ 3,  కెరమెరి 2, జైనూర్, రెబ్బెన, చింతలమానేపల్లి, దహెగాం మండలాల్లో ఒక్కో బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. వీరందరినీ జిల్లా బాలల సంరక్షణ కేంద్రం, ఐసీడీఎస్, సఖి కేంద్రాలు, డీసీపీఓ, ఎంపీడీఓల సమన్వయంతో అడ్డుకున్నారు.
    
ఫిబ్రవరిలో చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామంలో బాల్య వివాహం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తి చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫోన్ చేశారు. అధికారులు గ్రామంలో వెళ్లి పెండ్లిని అడ్డుకున్నారు. ఆలస్యమైతే ఆ బాలిక పెండ్లి తంతు జరిగిపోయేదే. చిన్నవయసులో పెండ్లి చేయడం వల్ల బాలిక ఎదుర్కొనే సమస్యలు, ఇతర విషయాలను తల్లిదండ్రులకు వివరించి కౌన్సెలింగ్​ఇచ్చారు. వయసు నిండిన తర్వాతే పెండ్లి చేయాలని సూచించారు.
    
గతేడాది ఏప్రిల్​లో వాంకిడి మండలానికి చెందిన ఓ బాలిక తనకు ఇష్టం లేకుండానే తల్లిదండ్రులు పెండ్లి చేస్తున్నారని సమీప బంధువుల వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆ బంధువులకు 1098కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అధికారులకు హుటాహుటిన అక్కడికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబీకులు, గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
    
గతేడాది ఫిబ్రవరిలో ఆసిఫాబాద్ మండలంలో బాల్య వివాహం జరుగుతోందని కొందరు వ్యక్తులు 100కు కాల్ చేశారు. దీంతో పోలీసులు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సదరు గ్రామానికి చేరుకున్నారు. బాలిక తల్లిదం డ్రులు, బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి వయసు నిండే వరకు పెండ్లి చేయకూడదని నచ్చజెప్పడంతో ఆ పెండ్లిని అపేశారు.

కొద్ది కాలానికే విడిపోతున్నరు

వయసు నిండకముందే బాలికలకు తల్లి దండ్రులు పెండ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపుతుండగా.. అనేక కారణాలతో కొద్ది రోజుకే తిరిగి వారు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. తిరిగి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఆడపిల్ల భారం తగ్గించుకున్నామను కునే లోపే తిరిగి పుట్టింటికి చేరుకుంటుండడంతో ఆ తల్లిదండ్రులు సైతం మనోవేదనకు గురవతున్నారు. దాంపత్య జీవితం అంటే ఎమిటో తెలియక పోవడం, కుటుంబసభ్యులను అర్థం చేసుకోకపోవడం, పలు అంశాలపై అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాలతో సతమతమవుతున్నారు. మనస్పర్థలు కారణంగా కొద్ది కాలానికే విడిపోతున్నారు.

కల్యాణ లక్ష్మి, ఇతర పథకాలకు దూరం

బాల్య వివాహాలను నివారించడానికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల్లో అవహగాహన లేకపోవడంతో బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతూ కల్యాణ లక్ష్మితోపాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలకు దూరం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో ..భేటీ పడావో, సుకన్య సంవృద్ధి యోజన వంటి పథకాలను అందుకోలేకపోతున్నారు. 

బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలు

బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయికి అనేక సమస్యలు తలెత్తుతాయి. శారీరకంగా అనారోగ్యం పాలవుతారు. రక్త హీనత, వ్యాధి నిరోధక శక్తి తగ్గి పోవడం, పుట్టబోయే బిడ్డకు, తల్లికి ప్రమాదం పొంచి ఉంటుంది. బాల్య వివాహం చెయ్యడం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మంచిది కాదు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.పెళ్లి చేసిన పూజారి, పెళ్లి కొడుకు,  పెద్దలు, ఇరు కుంటుంబాల బంధువులపై కేసులు నమోదు చేస్తాం.
- భాస్కర్, పీడీ, ఐసీడీఎస్