ప్రాజెక్టుల అసలు లెక్కలపై రిపోర్ట్​ ఇవ్వండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

ప్రాజెక్టుల అసలు లెక్కలపై రిపోర్ట్​ ఇవ్వండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ప్రాజెక్టుల అసలు లెక్కలేంటో ప్రజలకు తెలియాల్సిందేనని, సాగునీటి పారుదల రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. నీటి పారుదల, వ్యవసాయ శాఖలపై గురువారం ఉదయం తన నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారు.. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు.. అనే వివరాలను కూడా ప్రజలకు తెలియజెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద డెడికేటెడ్​ఆయకట్టుకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లను ఎవరు అప్రూవ్​చేశారు? డిజైన్ల ఆమోదం వెనుక గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఎంత మేరకు ఉంది? తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు ప్రాజెక్టును మార్చాల్సి వచ్చింది?  ఆ రీ డిజైన్​లో ఎవరు భాగస్వాములు?... అనే పూర్తి వివరాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంగా మాపై ఉంది” అని ఆయన అన్నారు.  ఇందులో ఎలాంటి దాపరికాలకు తావివ్వకుండా అన్ని వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్​చేయడానికి ముందు ప్రాణహిత – చేవెళ్లపై ఎంత ఖర్చు చేశారని, వాటిలో ఎన్ని పనులను ఉపయోగించుకున్నారని, రీ డిజైన్​ కారణంగా ఎంత ప్రజాధనం వృథా అయిందనే వివరాలు ఇవ్వాలని చెప్పారు.

పాలమూరు ప్రాజెక్టు పరిస్థితేమిటి?

 ‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి డిజైన్​చేసి మళ్లీ శ్రీశైలానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది? తద్వారా ప్రాజెక్టు నిర్మాణం కోసం పెరిగిన వ్యయం ఎంత? ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు వచ్చాయి?  ఇంకా ఏయే పర్మిషన్లు రావాల్సి ఉంది?.. అనే వివరాలు ఇవ్వాలి” అని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. ‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ఇంకా ఏమైనా మార్పులు చేశారా..ఈ ప్రాజెక్టు కోసం చేసిన పనులతో కల్వకుర్తి పంపుహౌస్​పై ప్రభావం ఎంతమేరకు పడింది..? కల్వకుర్తి కాల్వల సామర్థ్యం పెంచడానికి గడిచిన పదేండ్లలో ఏం చేశారు?.. అనే వివరాలు ఇవ్వాలి” అని చెప్పారు. 

లెక్కలు దాచిపెడ్తే కఠిన చర్యలు

‘‘జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులు.. 2014 జూన్​2న తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చే నాటికి వాటి పరిస్థితి, వాటిపై ఎంత ఖర్చు చేశారు.. అప్పుడు ఇంకా ఎంత మొత్తం ఖర్చు చేసి ఉంటే ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యేవి, వాటి కింద ఎంత ఆయకట్టుకు నీళ్లు వచ్చేవి అనే వివరాలను ప్రజల ముందు పెట్టాలి” అని అధికారులతో సీఎం రేవంత్​ అన్నారు. ‘‘1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలన్నీ ఇవ్వాలి” అని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు ప్రజలకు తెలియాల్సిందేనని, దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని.. ఒక వేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని, ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరచి చెప్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,  సీఎస్ శాంతి కుమారి, సీఎంవో ప్రిన్సిపల్​సెక్రటరీ శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు  పాల్గొన్నారు.

సీఎం రేవంత్​ ఢిల్లీ టూర్ రద్దు

సీఎం రేవంత్​ రెడ్డి ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో రద్దైంది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నా.. అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చలు జరుగుతున్నందున సీఎం తన పర్యటనను రద్దు చేసుకున్నారు. సభలో విద్యుత్​పై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్​ కూడా మాట్లాడారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రసంగించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అయితే, సీడబ్ల్యూసీ సమావేశాలకు బయలుదేరడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో  ఢిల్లీ ప్రయాణాన్ని రేవంత్ రద్దు చేసుకున్నారు.