పేదలకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యాలె : అఖిలపక్ష నేతలు

పేదలకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యాలె : అఖిలపక్ష నేతలు

షాద్ నగర్, వెలుగు: ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై అఖిలపక్ష సమావేశం జరిగింది. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, సీపీఐ రాష్ట్ర నేత పానుగంటి పర్వతాలు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్.రాజు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, వైఎస్సార్ తెలంగాణ నియోజకవర్గ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 3100 డబుల్​బెడ్రూం ఇండ్లు కడతామని చెప్పిన ప్రభుత్వం ఇందులో 2065 మాత్రమే మంజూరు చేసిందని, చివరకు కేవలం 1880 ఇండ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభించారని పేర్కొన్నారు. పేదల పక్షాన ఉండాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికి ఆ ఇండ్లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన నిరు పేదలకు ఇవ్వాలని డిమాండ్​చేశారు. సమావేశంలో పీసీసీ సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్,శీను నాయక్, ఈశ్వర్ నాయక్, ప్రశాంత్  పాల్గొన్నారు. 

ఐదేండ్లు దాటినా పంపిణీ చేయరా?   

ఘట్​కేసర్, వెలుగు: మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఆ ఇండ్ల నిర్మాణం పూర్తయి దాదాపు ఐదేండ్లు కావస్తున్నా ఇంకా ఎందుకు పంపిణీ చేయడంలేదని ప్రశ్నించారు. ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇండ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. ఈ కార్యక్రమంలో కో- ఆప్షన్ సభ్యుడు భద్రారెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.