న్యూఢిల్లీ: ఇక నుంచి తమ వెహికల్‌ను అమ్మాలనుకునే వాళ్లు దాని టోల్‌ట్యాక్స్ బకాయిలను చెల్లించి ఎన్‌ఓసీ తీసుకోవడం తప్పనిసరి. బారియర్ ఫ్రీ టోలింగ్ వ్యవస్థ అమలు కోసం కేంద్ర మోటారు వాహన నియమాలను మార్చామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ప్రకటించింది. యజమానులు బకాయిలు చెల్లించకుండా వాహనాన్ని అమ్మకూడదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోకూడదు.
బకాయిలు ఉంటే వాహన బదిలీకి ఎన్‌ఓసీ ఇవ్వరు. ఫిట్‌నెస్ రెన్యూవల్, పర్మిట్‌లకు కూడా అనుమతి ఉండదు. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సామర్థ్యాన్ని పెంచి టోల్ ఎగవేతలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. 2026లో దేశవ్యాప్తంగా బారియర్ ఫ్రీ టోలింగ్ తమ శాఖ లక్ష్యమని మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. టోల్ బకాయిలు ఉంటే ఫాస్టాగ్‌ను సస్పెండ్ చేస్తామని ఆయన వివరించారు.
