- కేసీఆర్‌కు నోటీసులిచ్చినా భయపడేది లేదు: కేటీఆర్
- ఫోన్ ట్యాపింగ్.. ఓ లొట్టపీసు కేసు
- అసెంబ్లీలో మంత్రులతోనే హరీశ్ ఫుట్‌బాల్ ఆడుకుండు
- ఐదుగురు ఆఫీసర్లు ఆయన్నేం చేస్తరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: వెయ్యి కేసులు పెట్టినా.. వంద సిట్లు వేసుకున్నా తాము భయపడబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు సిట్ విచారణ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ బామ్మర్ది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతోనే హరీశ్‌ను సిట్ విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో 8 మంది మంత్రులతోనే హరీశ్ సింగిల్‌గా ఫుట్‌బాల్ ఆడుకున్నాడని, ఇప్పుడు ఐదుగురు అధికారులు ఆయన్నేం చేయగలరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక లొట్టపీసు కేసని అన్నారు. ‘‘ఇలాంటి కేసులో కేసీఆర్‌కు నోటీసులిస్తరట.. ఇస్తే ఇచ్చుకో.. ఏం చేస్కుంటవో చేస్కో ” అని వ్యాఖ్యానించారు.
సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేసిన్రు
సింగరేణి టెండర్లను రేవంత్‌రెడ్డి బామ్మర్ది సుజన్‌రెడ్డి రిగ్గింగ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. హరీశ్ బయటపెట్టిన బొగ్గు స్కామ్ సమాచారం తప్పయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటిదాకా రేవంత్ కుటుంబం 9 సింగరేణి టెండర్లను నియంత్రించిందని ఆరోపించారు. ఎన్నడూ లేనివిధంగా.. అంచనా విలువ కన్నా మైనస్‌లో టెండర్లు పడే చోట.. ప్లస్‌లో టెండర్లు ఎలా పడ్డాయని అడిగారు. సీఎం బామ్మర్ది సుజన్‌రెడ్డి స్వయంగా అందరినీ బెదిరిస్తున్నారన్నారు. అర్హులైన కంపెనీలకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదన్నారు. భట్టి విక్రమార్క రద్దు చేశామని చెబుతున్న నైనీ కోల్ బ్లాక్స్ టెండర్ వెనుక కూడా అక్రమ దందా నడుస్తున్నదని ఆరోపించారు. సింగరేణి దొంగతనంలో బీజేపీకి సంబంధం లేకుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కోల్ మినిస్టర్ కిషన్‌రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలని, ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. రేవంత్ ఆడుతున్న రాజకీయ ఆటలో పోలీసు అధికారులు కచ్చితంగా బలవుతారని అన్నారు. ఇప్పుడు రెచ్చిపోతున్న పోలీసు అధికారులను రిటైర్ అయినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
