కార్పొరేటర్ కు మస్తు డిమాండ్.. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకూ పోటాపోటీ

కార్పొరేటర్ కు మస్తు డిమాండ్.. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకూ పోటాపోటీ
  • ప్రధాన పార్టీ టికెట్ల కోసం వెయ్యికి పైగా అప్లికేషన్లు
  • బీఆర్ఎస్​ నుంచే 446 మంది దరఖాస్తు
  • రెండోసారి అప్లికేషన్లు తీసుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ
  • బీజేపీలోనూ టికెట్​ కోసం పోటీ పడుతున్న ఆశావహులు

మహబూబ్​నగర్, వెలుగు: కొత్తగా ఏర్పడిన మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో కార్పొరేటర్​ సీట్లకు ఫుల్​ డిమాండ్​ ఏర్పడింది.  ప్రతి డివిజన్​ నుంచి ఒక్కో పార్టీ తరపున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో పది మందికిపైగానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్​గా మారింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు డివిజన్లకు ఇన్​చార్జీలను నియమించింది.

వీరు వచ్చిన అప్లికేషన్ల వారీగా వారం రోజులుగా ఎంక్వైరీ చేసి మంగళవారం రిపోర్ట్​ తయారు చేశారు. ఈ రిపోర్ట్​ ఆయా పార్టీల హైకమాండ్​కు పంపనున్నారు. ఇప్పటి వరకు మూడు ప్రధాన పార్టీల నుంచి 60 డివిజన్లలో టికెట్ల కోసం 1,069 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.

కాంగ్రెస్​ నుంచి 373 మంది..

అధికార కాంగ్రెస్​లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. వారం కింద ఆశావహులు దరఖాస్తు​చేసుకోవాలని డీసీసీ సూచించింది. ఇందుకోసం డీసీసీ ఆఫీసులో ఇద్దరు లీడర్లను నియమించింది. ప్రతి డివిజన్​ నుంచి ఏడు, ఎనిమిది మంది చొప్పున అప్లికేషన్లు అందజేశారు. 60 డివిజన్లకు గాను 373 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పార్లమెంట్  ఇన్​చార్జీగా నియమితులైన మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం నిర్వహించనున్నారు.

ఈ మీటింగ్  అనంతరం రెండోసారి అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఈ అప్లికేషన్లకు రూ.10 వేలకు పైగా ఫీజు నిర్ణయించనున్నారు. డీసీసీ ఆఫీస్​ పేరు మీద డీడీ తీసుకొచ్చి దరఖాస్తు చేసుకునేలా ప్లాన్​ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను మంత్రుల సమక్షంలో పరిశీలించి ఫిల్టర్​ చేయనున్నారు. ఫిల్టర్​ చేసిన అప్లికేషన్లపై సర్వే చేసి, సర్వేలో ఎవరి వైపు మెజార్టీ ప్రజలు మొగ్గు చూపుతారో వారికే పార్టీ తరపున బీఫారం ఇవ్వనున్నారు.

బీజేపీ నుంచి 250 అక్లికేషన్లు..

బీజేపీలో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఈ పార్టీ నుంచి ఇప్పటి వరకు కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి 250 మంది ఆశావహులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వచ్చిన అప్లికేషన్లను డివిజన్ల వారీగా విభజించారు. ఎనిమిది డివిజన్లకు ముగ్గురు చొప్పున సీనియర్  లీడర్లను డివిజన్​ ఇన్​చార్జీలుగా నియమించారు. వీరు వారం రోజుల నుంచి వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా డివిజన్లలో సర్వేలు చేస్తున్నారు. సర్వేలో ఎవరికి ప్రజల్లో ఎక్కువ మద్దతు ఉంది? ఇన్​చార్జీల పరిశీలనలో ఎలాంటి అంశాలను గుర్తించారు? ఎక్కువ మెజార్టీ ఎవరికి ఉంది? అనే వివరాలను సేకరించి హైకమాండ్​కు పంపనున్నారు.

అనంతరం డివిజన్ల వారీగా క్యాండిడేట్లను ప్రకటించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి మేయర్​ పీఠానికి ఎవరు పోటీ పడతారనేది తేల్చలేదు. ముందు కార్పొరేటర్లను గెలిపించుకున్న తర్వాతే మేయర్​ ఎవరనేది హైకమాండ్​ నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్ఎస్​లో పోటాపోటీ..

బీఆర్ఎస్​ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఈ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరగా.. 446 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నాల్గో డివిజన్​ నుంచి 20 మంది, 16వ డివిజన్​ నుంచి 18 మంది, 18వ డివిజన్ ​నుంచి 14 మంది, 2వ డివిజన్​ నుంచి  11 మంది, 29వ డివిజన్​ నుంచి 8 మంది టికెట్​ కోసం పోటీ పడుతున్నారు.

ఈ అప్లికేషన్ల పరిశీలనకు ఆ పార్టీ 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వీరు అప్లికేషన్లను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో రిపోర్ట్​ను హైకమాండ్​కు పంపనున్నారు. ఫైనల్​గా హైకమాండ్​ క్యాండిడేట్లను ప్రకటించనుంది.