- శాంతి మండలిలో చేరకుంటే ఫ్రాన్స్పైసుంకాలు విధిస్తామని ట్రంప్ వార్నింగ్
- ఆ దేశ ప్రెసిడెంట్ మాక్రన్ త్వరలోనే దిగిపోతారు
- పీస్ బోర్డులో ఆయన చేరాల్సిన అవసరమూ లేదని కామెంట్
- వెనెజువెలా, కెనడా, గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో భాగంగా చూపుతూ
- ఏఐ మ్యాప్ రిలీజ్ డెన్మార్క్‌లో గ్రీన్లాండ్ ‘సహజ భాగం’ కాదన్న రష్యా ..
- దాన్ని ఆక్రమించుకోబోమని వెల్లడి
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల పేరిట విదేశాలపై బెదిరింపులకు దిగారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తాను ప్రతిపాదించిన ‘శాంతి మండలి(పీస్ బోర్డు)’లో చేరేందుకు విముఖత వ్యక్తం చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ పై ఆయన మండిపడ్డారు. పీస్ బోర్డులో చేరనందుకు గాను ఫ్రాన్స్ నుంచి యూఎస్‌కు దిగుమతి అయ్యే వైన్, షాంపేన్లపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. ఫ్రెంచ్ వైన్, షాంపేన్లపై తాను 200 శాతం సుంకాలు విధిస్తే.. మాక్రన్ శాంతి మండలిలో చేరతారని అన్నారు.
మంగళవారం ఫ్లోరిడాలోని మియామీలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘మాక్రన్ ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే త్వరలోనే పదవి నుంచి దిగిపోతారు” అంటూ కామెంట్ చేశారు. ‘‘మాక్రన్ వైన్, షాంపేన్లపై నేను 200% టారిఫ్‌లు వేస్తాను. అప్పుడు ఆయన శాంతి మండలిలో చేరతారు. కానీ ఆయన మాకు అవసరం లేదు” అని అన్నారు. 2022లో రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడైన మాక్రన్ పదవీకాలం 2027 మే నెలలో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా అక్కసు వెళ్లగక్కారు. కాగా, గాజాలో శాంతి స్థాపన ప్రయత్నాల్లో భాగంగా ‘పీస్ బోర్డ్’ను ఏర్పాటు చేస్తామని, దానికి తాను అధ్యక్షత వహిస్తానని ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ఘర్షణల నివారణకు కృషి చేసేలా పీస్ బోర్డ్ పని చేస్తుందని ఆయన తాజాగా ప్రకటించారు. ఇందులో చేరాలని 60 దేశాలకు లేఖలు రాశారు. మూడేండ్ల కంటే ఎక్కువ కాలం మండలిలో మెంబర్స్ గా ఉండాలనుకునే దేశాలు బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చాలన్నారు. ఈ మండలిలో చేరాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు కూడా ఆహ్వానం పంపామన్నారు. కాగా, గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న పలు యూరోపియన్ దేశాలపై
ఫిబ్రవరి నుంచి 10 శాతం అదనపు టారిఫ్‌లు వేస్తున్నానని కూడా ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.
గ్రీన్లాండ్లో ట్రంప్ జెండా
వెనెజువెలా, కెనడా, గ్రీన్లాండ్ దేశాలు అమెరికాలో భాగంగా ఉన్నట్టుగా చూపుతూ ట్రంప్ ఓ ఫొటోను రిలీజ్ చేశారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్, ఇటలీ ప్రధాని మెలోనీ, బ్రిటన్ ప్రధాని స్టార్మర్, యురోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఇతర నాటో దేశాల అధినేతలు సమావేశమైనట్టుగా.. ఆ రూంలోని ఓ గోడపై వెనెజువెలా, కెనడా, గ్రీన్లాండ్ కూడా అమెరికా భూభాగాలుగా చూపే మ్యాప్ తగిలించినట్టుగా ఈ ఫొటోను క్రియేట్ చేశారు. ట్రంప్ దీనిని మంగళవారం తన ‘ట్రూత్ సోషల్’ అకౌంట్లో షేర్ చేశారు.
గ్రీన్‌లాండ్‌ను తాము స్వాధీనం చేసుకునే విషయంలో యురోపియన్ యూనియన్ దేశాలు మరీ ఎక్కువగా అడ్డు తగలొద్దని హెచ్చరించారు. దీనిపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్‌తో ఫోన్లో మాట్లాడానని, ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని పేర్కొన్నారు. ప్రపంచంలో బలంతోనే శాంతిని సాధించగలమని, ఇప్పుడు అమెరికాను మించిన బలమైన దేశమేదీ లేదన్నారు. అలాగే గ్రీన్లాండ్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి గ్రీన్లాండ్లో అమెరికా జెండాను పాతుతున్నట్టు క్రియేట్ చేసిన ఫొటోను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇందులో ‘గ్రీన్ లాండ్, అమెరికా భూభాగం. స్థాపన: 2026’ అని రాసి ఉన్న బోర్డును పెట్టినట్టుగా చూపించారు.
ఈయూపై టారిఫ్‌లు.. ట్రంప్ తప్పిదమే: ఉర్సులా
గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునేందుకు సహకరించడంలేదంటూ యురోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై ఫిబ్రవరి నుంచి 10% అదనపు టారిఫ్‌లు విధిస్తానంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన తప్పిదమని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా మిత్రులుగా ఉన్న దేశాలపై ఇలాంటి తీరు సరికాదన్నారు. మంగళవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈయూ, అమెరికా మధ్య గతేడాది జులైలో ట్రేడ్ డీల్ కుదిరిందని, రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా డీల్‌కు ఒప్పుకుంటే కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఈయూ
దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని, ఎలాంటి చర్యలనైనా కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు.
