జవహర్ నగర్లో వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపిన కొడుకు

జవహర్ నగర్లో వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపిన కొడుకు
  • హైదరాబాద్ జవహర్​ నగర్​లో ఘటన

జవహర్ నగర్/జూబ్లీహిల్స్, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపాడో కొడుకు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. జవహర్​నగర్ లోని విఘ్నేశ్వరకాలనీలో పొట్టోళ్ల రజిని (40) తన ఇద్దరు కొడుకులు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. జమీల్ (38) అనే వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె వివాహేతర సంబంధం నడుపుతున్నది. రజిని చిన్న కొడుకు రాజ్ కరణ్ (24) కు ఈ విషయం తెలియడంతో జమీల్​పై కోపం పెంచుకున్నాడు. అయితే, దొంగతనాలు చేస్తున్నాడని ఇటీవల రాజ్ కరణ్​ను జమీల్  పోలీసులకు అప్పజెప్పాడు. 

దీంతో జమీల్ పై మరింత కోపం పెంచుకొని అతనిని అంతమొందించాలని డిసైడ్  అయ్యాడు. ఈ విషయాన్ని తన స్నేహితులు కృష్ణ, షోయబ్, సోహైల్, మాణిక్​కు తెలిపాడు. జమీల్  హత్య కోసం స్నేహితులతో కలిసి ప్లాన్  చేశాడు. ప్లాన్ ప్రకారం.. ఈనెల 13న జమీల్​ను ఇంటికి పిలుచుకున్నాడు. మద్యం సేవించిన తర్వాత జమీల్​ను చంపాలని ప్రయత్నించారు. జమీల్ తన ఇంటికి వెళ్తానని బయటకు రాగా.. రాజ్ కరణ్  తన స్నేహితులతో కలిసి అతనిపై దాడికి పాల్పడ్డాడు. 

జమీల్​ను కొట్టవద్దని రజిని మధ్యలోకి వచ్చింది. దీంతో రాజ్ కరణ్  ఇంట్లోంచి కత్తి తీసుకొచ్చి జమీల్​పై విసిరేయగా అది రజినికి తగిలి తీవ్రంగా గాయపడింది. దీంతో రజినిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతి చెందింది. రజిని మృతికి కారణమైన రాజ్ కరణ్, కృష్ణను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం కోసం గాలిస్తున్నారు. 

అనుమానంతో భార్యను రోకలి బండతో హత్య చేసిన భర్త

మరో ఘటనలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను రోకలి బండతో కొట్టి చంపాడు. బోరబండలో ఈ ఘటన జరిగింది. బోరబండలోని రాజీవ్ గాంధీ నగర్​కు చెందిన సరస్వతి (34), ఆంజనేయులు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, ఆంజనేయులు డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు.

కొద్ది రోజులుగా సరస్వతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెతో పలుమార్లు గొడవ పడ్డాడు. సోమవారం ఇదే విషయమై భార్యతో గొడవపడి రోకలి బండతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.