ఒక్క లోక్ సభ సీటైనా ఇవ్వండి.. కాంగ్రెస్​కు సీపీఐ ప్రతిపాదన

ఒక్క లోక్ సభ సీటైనా ఇవ్వండి.. కాంగ్రెస్​కు సీపీఐ ప్రతిపాదన
  • ఇరుపార్టీలూ ఇండియా కూటమి భాగస్వాములే

హైదరాబాద్, వెలుగు:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​తో కలిసి పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. ఇండియా కూటమిలో భాగస్వాములు కావడంతో పొత్తు కుదిరే అవకాశం ఉందని ఆ పార్టీ యోచిస్తోంది. నాలుగైదు స్థానాల పేర్లను ప్రతిపాదించి, దాంట్లో ఒక్క సీటైనా తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి సీపీఐ పోటీ చేసింది. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం సీటు ఇవ్వగా, అక్కడ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి విజయం సాధించారు. ఈ మధ్యనే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లోనూ సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ గెలుపొందింది. దీంతో ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే భావనలో ఆ పార్టీ ఉంది. భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ తదితర స్థానాలను కాంగ్రెస్​కు ప్రతిపాదించి, దీంట్లో ఏ సీటు ఇచ్చినా పోటీ చేయాలని యోచిస్తోంది. ఇటీవల సీపీఐ నేతలు పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో పొత్తుపై చర్చ జరిగింది. ఒక సీటు ఇవ్వాలని అడిగినట్టు నేతలు చెప్తున్నారు. అయితే, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ రెడ్డి వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఎటూ తెల్చుకోని సీపీఎం

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై సీపీఎం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్​గా పోటీ చేసి ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. సీపీఎం కూడా ఇండియా కూటమిలో భాగస్వామి. అయితే, ఏదైనా ఒక సీటు అడగాలా? లేక కాంగ్రెస్​కు మద్దతివ్వాలా? అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.