కరోనా పేషెంట్లకు సగం బెడ్లు ఇవ్వండి

కరోనా పేషెంట్లకు సగం బెడ్లు ఇవ్వండి
  • ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలను కోరిన సర్కారు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్టయింది. ఎమర్జెన్సీ కేసులు పెరిగే ప్రమాదం ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రుల మేనేజ్మెంట్లతో మంగళవారం చర్చలు జరిపింది. కరోనా ఎమర్జెన్సీ కేసులకు 50 శాతం బెడ్స్ కేటాయించాలని ఆస్పత్రులను హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కోరారు. మైల్డ్ కేసులకు ప్రైవేటు హోటల్స్లో కరోనా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎలెక్టివ్ సర్జరీలను ఆస్పత్రులు తగ్గించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా బారిన పడి ఆరోగ్యం విషమిస్తున్న వారి సంఖ్య తక్కువే ఉన్నా మున్ముందు పెరగొచ్చని భావిస్తున్నారు. లక్షల్లో కేసులొస్తే ఎమర్జెన్సీ పేషెంట్లకు బెడ్స్ కూడా దొరకని పరిస్థితి రావొచ్చని, ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితి ఎదురవ్వొచ్చని సర్కారు హెచ్చరించడంతో ముందస్తుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో హెల్త్ డిపార్ట్మెంట్ సమావేశమైనట్లు తెలిసింది. 
రాష్ట్రంలో 7,064 ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ 
రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లన్నింటిలో ఆక్సిజన్, ఐసీయూ పడకలు కలిపి 7,064 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 1,895 బెడ్స్ నిండిపోయాయి. లక్షణాల్లేని వాళ్లు ఇండ్ల దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు కరోనా పేషెంట్లను అవుట్ పేషెంట్గా చూస్తున్నాయి. ఇంటి దగ్గర సౌకర్యం లేని వాళ్లను హాస్పిటళ్లకు అనుసంధానంగా ఉండే ప్రైవేటు హోటల్స్లో ఉంచుతున్నాయి.