‘ఉస్మానియా దవాఖాన’ కూల్చివేతకు పర్మిషన్ ఇవ్వండి

‘ఉస్మానియా దవాఖాన’ కూల్చివేతకు పర్మిషన్ ఇవ్వండి
  • ఓల్డ్‌‌ బిల్డింగ్‌‌పై సర్కార్‌‌‌‌కు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ విజ్ఞప్తి
  • కమిటీని నియమించిన ఎంఏయూడీ

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్‌‌ ఓల్డ్‌‌ బిల్డింగ్‌‌ కూల్చివేతకు పర్మిషన్ ఇవ్వాలని హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు హెచ్‌‌ఎండీఏ హెరిటేజ్ రెగ్యులేషన్స్‌‌–1981 ప్రకారం కూల్చివేతకు పర్మిషన్ ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. హెచ్‌‌ఎండీఏ పరిధిలోని హెరిటేజ్ భవనాల పర్యవేక్షణ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ పరిధిలో ఉండడంతో, హెల్త్ సెక్రటరీ రిక్వెస్ట్‌‌ను ప్రభుత్వం మున్సిపల్ శాఖకు పంపించింది. ఉస్మానియా బిల్డింగ్ పరిస్థితిని అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఎంఏయూడీ స్పెషల్ సీఎస్‌‌ అరవింద్ కుమార్ ఓ కమిటీ వేశారు. ఆర్‌‌‌‌అండ్‌‌బీ ఈఎన్‌‌సీ, ఎంఏయూడీ పరిధిలోని పబ్లిక్ హెల్త్ విభాగపు ఈఎన్‌‌సీ, పంచాయతీరాజ్‌‌ ఈఎన్‌‌సీ, జీహెచ్‌‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఈ కమిటీలో ఉన్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 10న జారీ చేసిన జీవో తాజాగా వెలుగులోకి వచ్చింది. మార్చి చివరి నాటికి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఉస్మానియా ఓల్డ్‌‌ బిల్డింగ్ కూల్చివేతకు గతంలోనే హెల్త్ డిపార్ట్‌‌మెంట్ సిద్ధమైంది. గతంలోనూ ఇలాగే కమిటీ వేసి కాలయాపన చేసింది. ఇప్పుడు పాత బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీంతో కోర్టుకు చెప్పుకునేందుకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకనే కమిటీని తెరపైకి తెచ్చారని విమర్శలు వస్తున్నాయి.

‘ఉస్మానియా’ బిల్డింగ్ కూల్చేస్తరా?: హైకోర్టు​
చారిత్రక నేపథ్యం ఉన్న ఉస్మానియా బిల్డింగ్‌‌ను కూల్చేస్తారా అని రాష్ట్ర సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ గనుక బిల్డింగ్ కూల్చేయాలని నివేదిక ఇస్తే.. ఐఐటీ, పురావస్తు శాఖ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో తాము మరో కమిటీ వేస్తామని చెప్పింది. తాము కమిటీ ఏర్పాటు చేసే అవసరం ఉంటుందని అనుకోవడం లేదని, ప్రభుత్వం కూడా ఉస్మానియా హాస్పిటల్‌‌ బిల్డింగ్‌‌ను కూల్చే ప్రయత్నం చేయదని భావిస్తున్నట్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ డివిజన్‌‌ బెంచ్‌‌ పేర్కొంది. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌‌ను కూల్చేసి అదే స్థలంలో కొత్త బిల్డింగ్‌‌ నిర్మించాలని కొందరు, చారిత్రక భవనాన్ని కూల్చొద్దని మరికొందరు వేసిన వేర్వేరు పిల్స్‌‌ను బెంచ్‌‌ గురువారం విచారించింది. కొత్తగా నిర్మించే భవనాల కంటే పాత బిల్డింగ్‌‌లే పటిష్టంగా ఉన్నాయని, చారిత్రక నేపథ్యం ఉన్న భవనాలను కూల్చాలనే ప్రతిపాదన సరైనది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. కొత్త బిల్డింగ్‌‌లే త్వరగా శిథిలావస్ధకు చేరుకుంటున్నాయని కామెంట్ చేసింది. చారిత్రక భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అవసరమైతే రిపేర్లు చేయాలని లాయర్ కేఎస్ మూర్తి సూచించారు. బిల్డింగ్‌‌ ప్రమాదకర స్థాయికి చేరినందున కూల్చివేయాలని మరో లాయర్ ఎస్‌‌.సందీప్ రెడ్డి వాదించారు. దీనికోసం సర్కారు కమిటీ వేసిందన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలు విన్న బెంచ్.. విచారణ ఏప్రిల్‌‌ 8కి వాయిదా వేసింది.