- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు:హెచ్‌ఎండీఏలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బఫర్ జోన్ నోటిఫై, ఆక్రమణల తొలగింపు వివరాలివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా రామమ్మ కుంట ఎఫ్‌టీఎల్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐటీహెచ్‌ఎం) కట్టిన భవన భాగాన్ని తొలగించాలని హెచ్‌ఎండీఏ అధికారులకు తేల్చిచెప్పింది.
నగరంలోని రామమ్మ కుంట ఎఫ్‌టీఎల్‌లో ఎన్‌ఐటీహెచ్‌ఎం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మానవ హక్కులు, వినియోగదారుల పరిరక్షణ సెల్ ట్రస్ట్ 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఏడాది క్రితం తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వర్చువల్‌గా హాజరై, వివరణ ఇవ్వాలని గత విచారణ సందర్భంగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను ఆదేశించగా.. సర్ఫరాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ తో కూడిన బెంచ్బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఠాకూర్ కిరణ్‌సింగ్, కేంద్రం తరఫున డీఎస్‌జీ గాడి ప్రవీణ్‌కుమార్, ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ తరఫున ఈ సిద్ధార్థ గౌడ్ హాజరయ్యారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు, కుంటలు ఉన్నాయని, వీటిలో 230 నీటి వనరులకు బఫర్ జోన్ నిర్ధారిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చామని, 2,525 నీటి వనరులకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని ఏజీ తెలిపారు. ఈ 2,525 నీటి వనరులకు బఫర్ జోన్‌ను నిర్ధారిస్తూ త్వరలో ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తామని, అంతేకాకుండా మిగిలిన చెరువులకు కూడా ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమిషనర్ చెప్పారు.
ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక అందజేయడానికి 3 నెలల సమయం కావాలని ఆయన ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌లో పేర్కొన్నట్టు ఆక్రమణలుంటే గుర్తించి తొలగిస్తామని, దీనిపై కూడా నివేదిక అందజేస్తామని ఏజీ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. మూడు నెలల్లో ప్రక్రియ అంతా చేపట్టి, నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.
