మీడియాకు వివరాలివ్వడం రూల్స్ ఉల్లంఘించడమే : లాయర్ ఎస్‌‌డీ సంజయ్‌‌

మీడియాకు వివరాలివ్వడం రూల్స్ ఉల్లంఘించడమే : లాయర్ ఎస్‌‌డీ సంజయ్‌‌
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడి తరఫు లాయర్ వాదనలు 
  • విచారణ ఇయ్యాల్టికి వాయిదా 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారని, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించడమేనని నిందితుడు తుషార్‌‌ వెల్లపల్లి తరఫు లాయర్ ఎస్‌‌డీ సంజయ్‌‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్‌‌ దర్యాప్తును రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లపై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా సంజయ్ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన వీడియోలను సీఎం మీడియాకు చూపించడంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌లకు కూడా పంపారు. కేసు విచారణ టైమ్ లో ఇలా వీడియోలు పంపడంపై ప్రభుత్వం తరఫు లాయర్ క్షమాపణలు కూడా చెప్పారు. సీఎం చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడేమో సీఎం మీడియా సమావేశం నిర్వహించడం వల్లనే కేసు దర్యాప్తును ప్రభావితం చేసినట్లు ఎట్ల అవుతుంది? అని సర్కార్ లాయర్ ప్రశ్నిస్తున్నారు. కేసులోని కీలక విషయాలను లీక్‌‌ చేసేసి, అన్నీ పబ్లిక్‌‌ డొమైన్‌‌లో ఉన్నాయని ప్రభుత్వం వితండ వాదన చేస్తోంది. సీఎం మీడియాకు లీక్‌‌ చేసే నాటికి చాలామంది నిందితులుగా కూడా లేరు. కానీ సీఎం మాత్రం చాలా మంది గురించి ఆరోపణలు చేశారు” అని అన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌‌ లో ముగ్గురు ఐపీఎస్‌‌లు ఉన్నారు. వారంతా సీఎం చెప్పుచేతల్లో ఉంటారు. వాళ్లకు పోస్టింగ్స్, ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్‌‌ వంటివి సీఎం ఆదేశాల మేరకే ఉంటాయి” అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిట్‌‌ ను కొనసాగిస్తే కేసు దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుందన్నారు. సీబీఐ దర్యాప్తును కొనసాగించాలని, సింగిల్‌‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవద్దని కోరారు. 

సర్కార్​ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసింది: దవే 

టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ అడ్వొకేట్‌‌ దుష్యంత్‌‌ దవే ఆరోపించారు. నిజంగానే ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగి, ప్రభుత్వం పడిపోయి ఉంటే ప్రజల తీర్పుకు అర్థం లేకుండా పోయేదన్నారు. ‘‘సీఎం నవంబర్‌‌ 3న మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటికే ఈ కేసులో పోలీసుల దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్‌‌ దర్యాప్తును సీఎం మీడియా సమావేశం ఏవిధంగా ప్రభావితం చేసినట్లు అవుతుంది. సీఎం మీడియాతో మాట్లాడినప్పుడు సిట్‌‌ ఏర్పాటే కాలేదు” అని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌‌రెడ్డి తరఫున సీనియర్‌‌ లాయర్‌‌ గండ్ర మోహన్‌‌రావు వాదిస్తూ.. దర్యాప్తు అధికారిపై ఆరోపణలు లేనప్పుడు సిట్‌‌ నుంచి సీబీఐకి బదిలీ చేయరాదన్నారు. సిట్‌‌ దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా, తనకు అనారోగ్యంగా ఉందని దవే చెప్పడంతో ఆయన ఆరోగ్య పరిస్థితులను బట్టి తదుపరి విచారణ బుధవారం కొనసాగించాలో లేదో నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది.