ముగిసిన ఓయూ గ్లోబల్​ అలుమ్నీ మీట్

ముగిసిన ఓయూ గ్లోబల్​ అలుమ్నీ మీట్
  • పూర్వ విద్యార్థులతో సందడిగా మారిన క్యాంపస్
  • వర్సిటీ అభివృద్ధి కోసం విరాళాల వెల్లువ

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ‘గ్లోబల్ అలుమ్నీ మీట్’ బుధవారం ముగిసింది. పూర్వ విద్యార్థులంతా ఉదయం వారు చదివిన విభాగాల్లో సమావేశమయ్యారు. మధ్యాహ్నం తర్వాత టాగూర్ ఆడిటోరియంలో పలు అంశాలపై జరిగిన గ్రూప్ ​డిస్కషన్స్​లో పాల్గొన్నారు. ఇండస్ట్రియలిస్ట్ గా ఎదిగిన కొందరు వర్సిటీతో పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. దాదాపు రూ.8 లక్షలు స్కాలర్​షిప్​లు హామీ ఇచ్చారు. ఆయా విభాగాలకు విరాళాల రూపంలో రూ.2 కోట్లు ఇచ్చారు. ‘అకాడమియా – ఇండస్ట్రీ లింకేజీ’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో కనీసం ఒక సెమిస్టర్ కాలం సంబంధిత ఇండస్ట్రీతో కలిసి పనిచేసేలా పాఠ్య ప్రణాళిక ఉండాలని ప్రముఖులు సూచించారు. వర్సిటీతో సంబంధిత ఇండస్ట్రీలు అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. ఉస్మానియా బ్రాండ్ ను మరింత పెంచేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. భాను ప్రకాశ్ వర్ల మోడరేటర్​గా వ్యవహరించగా, క్యావియం నెట్​వర్క్స్ సీఈవో సయ్యద్ బషరత్ అలీ, ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్ బోర్డ్ మెంబర్ డాక్టర్ రాజు ఎస్.గన్నవరపు, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, సోలిక్స్ టెక్నాలజీస్ సీఈవో సాయి గుండవల్లి, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సహా పలు కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. ‘ఉస్మానియా అలుమ్ని కనెక్ట్ టు రీ కనెక్ట్’, ‘ఉన్నత విద్య, సవాళ్లు’ అనే అంశాలపై నిర్వహించిన చర్చలో వీసీలు, మాజీ వీసీలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మోడరేటర్​గా వ్యవహరించారు. ఉన్నత విద్యకు అసలైన సవాల్ ప్రాథమిక విద్య బలంగా లేకపోవటమేనని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బీజే రావు అభిప్రాయపడ్డారు. దాదాపు 12 మంది వీసీలు పాల్గొన్న చర్చలో ఒక్క మహిళ కూడా లేకపోవటం బాధాకరం అన్నారు. విద్యా వ్యవస్థ కేవలం సమాచారం ఇచ్చే కాగితంగా ఉందని, చిన్న నాటి నుంచే సరికొత్త ఆలోచనలను ప్రేరేపించే దిశగా ఉండాలని సూచించారు. మూడు, నాలుగేండ్లలో ఉస్మానియా వర్సిటీ ప్రపంచ స్థాయి బ్రాండింగ్ కు చేరుకోగలదని మాజీ వీసీ, ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ చెప్పారు. రిటైర్డ్ ​వీసీ, మణిపూర్ విశ్వవిద్యాలయం చాన్స్​లర్​ప్రొఫెసర్ తిరుపతిరావు, శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్ రావు, ప్రొఫెసర్లు భాగ్యనారాయణ, సత్యనారాయణ, రామచంద్రం, రవీందర్ గుప్తా, సీతారామరావు, లింబాద్రి, వెంకటరమణ, కృష్ణ దేవరాయ తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల క్లాసికల్, వెస్టర్న్, జాన పద నృత్యాలతో టాగూర్ ఆడిటోరియం మార్మోగింది. వివిధ అంశాలపై చేసిన స్కిట్లు ఆలోచింపజేశాయి.

విరాళాలు..

ఎడ్యుకేషన్ కాలేజీకి ఐజీ నర్సింహా రూ.లక్ష 25వేలు, రిటైర్డ్​ఐఏఎస్ చిరంజీవులు రూ.లక్ష అందజేశారు. పీజీ లా కాలేజీ బ్లాక్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ అడ్వకేట్ రామచందర్ రావు రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. సీనియర్ లాయర్  డి.వెంకట్ రెడ్డి రూ.లక్ష,  ఇంగ్లీష్, ఫారిన్​లాంగ్వేజెస్​ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సురేశ్​కుమార్ రూ.లక్ష విరాళం అందించారు.